బిఎస్పి అగ్రనేత్రి మాయావతి తన రాజకీయ వారసునిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్ ఇంతకాలం వరకు బీఎస్పీ నేషనల్ కార్డినేటర్గా బాధ్యతలు నిర్వహించారు. 2017లో 22ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన్ని పార్టీ నేతలకు మాయావతి ఆయన్ని పరిచయం చేశారు.
బిజినెస్ గ్యాడ్జ్యూయేట్ అయిన ఆకాశ్ ఆనంద్ మయావతి ఫొటోల్లో అనేకమార్లు కనిపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ బీఎస్పీ ప్రచారాల్లో కీలకంగా వ్యవహించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో తొలి ర్యాలీని నిర్వహించారు. 2022 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సోషల్ మీడియా క్యాంపైన్ని రన్ చేశారు.
ఈ ఏడాది తొలినాళ్లల్లో 14 రోజుల సర్వజన్ హిత్, సర్వజన్ సుఖ్ అనే పేరుతో సంకల్ప యాత్రను లాంచ్ చేశారు ఆకాశ్ ఆనంద్. వారసత్వ రాజకీయాలను నిత్యం విమర్శించే మాయావతి 2019లో బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా తన సోదరుడు ఆనంద్ కుమార్‌ని ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఏకంగా తన మేనల్లుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు.
ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీఎస్పీ అఖిల భారత సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రకటన చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. యూపీ, ఉత్తరాఖండ్ మినహా దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్నచోట్ల పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు బీఎస్పీ షాజహాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వీర్‌సింగ్ పేర్కొన్నారు. అయితే పార్టీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ ప్రస్తావన లేదు.