వైసిపి ఎంపీగా ఉంటూనే ఆ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా సుమారు రెండేళ్లుగా పోరాటం జరుపుతున్న నరసాపూర్ ఎంపీ కె రఘురామరాజు చివరకు తన పదవికి రాజీనామా చేసి, తాజా ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. సంక్రాంతికి తన నియోజకవర్గంకు వెళ్లి, రాజీనామా ప్రకటింపవచ్చని తెలుస్తున్నది. ఆ తర్వాత బిజెపి, జనసేనల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు.
టిడిపి సహితం అభ్యర్థిని పోటీలో దింపకుండా, మద్దతు ఇవ్వడం ద్వారా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ మనుగడకు సవాల్ గా ఈ ఎన్నికలను మలిచేందుకు తెరవెనుక భారీ కృషి జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన ఈ లోగా చేతనైతే తన లోక్ సభ సభ్యత్వాన్ని అనర్హతో రద్దు చేసే పని చేయమని ఆయన వైసిపి నాయకత్వంకు సవాల్ చేశారు.
రెండేళ్లుగా తన నియోజకవర్గానికి, ఆంధ్ర ప్రదేశ్ కు దూరంగా ఉనున్న ఆయన గత తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక వైసిపి ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్దానికి సై అనే సంకేతం ఇచ్చారు. ఇప్పటి వరకు ఢిల్లీలో మీడియా ద్వారా నిత్యం ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.
గత సంవత్సరకాలంగా ఆయన లోక్ సభ సభ్యత్వంపై వేటు వేయమని వైసీపీ నాయకత్వం బిజెపి అగ్రనాయకత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నది. మరోవంక, రఘురామరాజు తనపై వేటుపడకుండా తన పలుకుబడి ఉపయోగిస్తున్నారు. దీంతో బిజెపి అగ్రనాయకత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీలో ఉంటూ కాకుండా, ప్రజా క్షేత్రంలోకి వచ్చి పోరాటం జరపాలని ఇప్పుడు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
ఈ లోపుగా ఉపఎన్నికపై ఆయన తీవ్రంగా దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ముందుగా బీజేపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగలరని భావించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో స్వతంత్ర అభ్యర్థిగా, అమరావతి రాజధాని అంశంపై పోటీ చేయడం ద్వారా విస్తృతమైన మద్దతు సమీకరించుకో గలరని నిర్ణయానికి వచ్చిన్నట్లు చెబుతున్నారు. అందుకు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వే కూడా చేయించుకున్నట్లు తెలిసింది.
నర్సాపురంలో దాదాపుగా 12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత రెండు ఎన్నికలలో – 2014, 2019 రెండు సార్లు వైసీపీకి 4.5 లక్షల ఓట్లు అటూ ఇటూగా వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఇక్కడ రెండు సార్లు గెలిచింది. 1999లో కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు బీజేపీ అభ్యర్ధులుగా గెలిచారు. 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ధికి 2.67 లక్షలు, 2019లో జనసేన అభ్యర్ధి నాగబాబుకు 2.50 లక్షల ఓట్లు వచ్చాయి.
దీని ద్వారా జనసేన మద్దతు ద్వారా ఖచ్చితంగా 2.50 లక్షల ఓట్లు వస్తాయనేది ఒక అంచనా. అదే విధంగా టీడీపీకి గణనీయంగా ఓట్ బ్యాంక్ ఉంది. 2019లో వైసీపీ హవాలోనూ ఇక్కడ టీడీపీకి 4.15 లక్షల ఓట్లు వచ్చాయి. నర్సాపురంలో క్షత్రియ – కాపు వర్గీయులే ఇప్పటి వరకు ప్రధానంగా పోటీ – గెలవటం జరుగుతూ వస్తోంది.
మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పట్ల మానస్ ట్రస్ట్ విషయంలో వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడంతో ఆ సామజిక వర్గంలో ఆగ్రవేశాలు నెలకొన్నాయి. దానితో వైసిపి పాలనపై ముప్పేట దాడికి ప్రారంభ వేదికగా మారగలదని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక్క బలపరిక్షగా మారే అవకాశం ఉంది.