పార్లమెంట్ లోకి అగంతకుల చొరబాటు వ్యవహారం కేంద్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పార్లమెంటుపై దాడి జరిగి 22 ఏళ్లు కావస్తున్న సందర్భంగా మరోసారి ఆ స్ధాయిలో కాకపోయినా ఎంపీల్ని భయభ్రాంతుల్ని చేసేలా ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.
ఏకంగా లోక్ సభ లోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతుకులు దూకి స్మోక్ గ్యాస్ ప్రయోగించడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం టీవీల్లో చూసిన జనం నిర్ఘాంతపోయారు. ఇది ఏకంగా కొత్త పార్లమెంట్ భద్రతపై అనుమానాలు రేకెత్తించింది.ఈ నేపథ్యంలో పార్లమెంటులో జరిగిన పరిణామాలపై అత్యున్నత స్దాయి దర్యాప్తు కేంద్రం, లోక్ సభ స్పీకర్ కూడా ఆదేశించారు.
అంతటితో ఆగకుండా పార్లమెంటు భద్రతా నిబంధనల్లో పలు మార్పులు చేశారు. కొంతకాలంపాటు సందర్శకుల గ్యాలరీలోకి వెళ్లేందుకు పాసులు ఇవ్వరాదని నిర్ణయించారు. అలాగే పార్లమెంటులోకి ఎంట్రీ, ఎగ్జిట్, ఇతర పాయింట్లలో ఎవరు వెళ్లాలనే దానిపైనా సమీక్ష చేస్తున్నారు.
ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి సందర్శకులకు అనుమతులు రద్దు చేశారు. అలాగే ఎంపీలు, సిబ్బంది, ఇతర సిబ్బంది, మీడియాకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలను కేటాయించారు. సందర్శకులు మాత్రం తిరిగి అనుమతించినప్పుడు నాలుగో నంబర్ గేటు నుంచి లోపలికి పంపుతారు.
అలాగే సందర్శకుల గ్యాలరీ ఇప్పుడు లోక్‌సభ ఛాంబర్లోకి దూకకుండా నిరోధించడానికి గాజు గ్లాసుతో కప్పేశారు. అలాగే విమానాశ్రయాల్లో వాడే బాడీ స్కాన్ మిషన్లను పార్లమెంట్లో ఏర్పాటు చేస్తున్నారు. సభ లోపల ఉండే భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించారు.
కాగా, పార్లమెంటు జరుగుతున్న సమయంలో లోక్ సభలోకి ప్రవేశించినట్లు కనిపించిది ఒకే వ్యక్తి అయినా మరో ఐదుగురు ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. వారిలో నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పార్లమెంటులోకి దూకిన ఇద్దరు వ్యక్తులు లక్నోకు చెందిన సాగర్ శర్మ, మైసూర్‌కు చెందిన డి మనోరంజన్‌గా గుర్తించారు. అలాగే బయట ఉన్న వ్యక్తి మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండేగానూ, మహిళ హర్యానాలోని హిసార్‌కు చెందిన నీలం దేవిగా గుర్తించారు. ఈ నలుగురిని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసుల యాంటీ టెర్రర్ సెల్ ఈ సంఘటనపై విచారణ చేపట్టింది. ఈ కుట్రలో ఐదో వ్యక్తి లలిత్ ఝా, ఆరో వ్యక్తి విక్కీ శర్మగా గుర్తించారు. వీరు పరారీలో ఉన్నారు.