ఆంధ్రప్రదేశ్లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా? ఇందుకు సంబంధించి శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, యినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారు.
”ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు” అని కేబినెట్ భేటీలో సీఎం జగన్ చెప్పారు.
సుమారు 15 రోజుల నుంచి 20 రోజుల ముందుగానే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ తమ మంత్రులతో చెప్పారు. కాగా 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా మే 23న ఫలితాలు వచ్చాయి. సీఎం జగన్ చెప్పిన ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.
అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈనాడు, యెల్లో మీడియాలో జరిగే ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.