ఇటీవల పార్లమెంటులో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొద్ది రోజుల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డిసెంబర్ 13 న లోక్‌సభలో జరిగినది “తీవ్రమైన సమస్య” అని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ విషయంలో చర్చ లేదా ప్రతిఘటనకు బదులు, పరిష్కారాన్ని కనుగొనడానికి సంఘటనను లోతుగా విచారించాల్సిన అవసరముందని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని స్పష్టం చేశారు. అందువల్ల, అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై విచారణ జరుపుతున్నాయని, చొరబాటుదారుల దాడి వెనుక ఉన్న ఉద్దేశాలను త్వరలో కనుగొంటామని ఆయన తెలిపారు.
‘‘పార్లమెంటులో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. స్పీకర్ సార్ పూర్తి సీరియస్‌గా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు కూడా కఠినంగా విచారణ చేస్తున్నాయి. దీని వెనుక ఉన్న అంశాలు మరియు ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి మేము విషయంలో లోతుగా వెళ్లడం ముఖ్యం” అని మోదీ చెప్పారు.
పరిష్కారాలను కూడా ఏకాభిప్రాయంతో వెతకాలని, ప్రతి ఒక్కరూ ఇలాంటి అంశాలపై చర్చకు లేదా ప్రతిఘటనకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా సూచించారు. పార్లమెంటులో ఇటీవల ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. లోక్ సభ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన ఇద్దరు వ్యక్తులు స్మాక్ క్యాన్లతో హల్ చల్ సృష్టించిన విషయం తెలిసిందే.
సాగర్ శర్మ, మనోరంజన్ డి – బుధవారం లోక్‌సభలోకి ప్రవేశించి, భద్రతా సమస్యలపై ఆందోళనలు చేస్తూ, స్మాక్ క్యాన్లను విడుదల చేశారు. మరోవైపు, పార్లమెంట్ లోపలా బయటా అలజడి సృష్టించిన ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నారు. వీరిలో స్మోక్ అటాక్ సూత్రధారి లలిత్ ఝాను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ దర్యాప్తు జరుపుతోంది.