గతంలో సిబిఐ అధికారిగా అక్రమ ఆస్తుల కేసులలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా సంచలనం సృష్టించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఆ ఇమేజ్ తో రాజకీయ ప్రవేశం కోసం గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు చెప్పుకోదగిన ఫలితాలు ఇవ్వక పోవడంతో తాజాగా తానే కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజకీయాల్లో మార్పు తీసుకురావటమే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపిస్తున్నట్టు శుక్రవారం విజయవాడలో వెల్లడించారు.
మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆయన సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని తెలుగు దేశం పార్టీ, బీజేపీలలో చేరడం ద్వారా 2019 ఎన్నికలలో పోటీ చేసేందుకు విఫల ప్రయత్నాలు చేశారు. అయితే ఆ రెండు పార్టీలు ఆయన పట్ల ఆసక్తి చూపక పోవడంతో చివరి క్షణంలో జనసేన పార్టీలో చేరి, విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీచేసి ఓటమి చెందారు.
ఆ తర్వాత జనసేన పార్టీకి కూడా దూరమయ్యారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తిరిగి విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు కొంతకాలం క్రితమే ప్రకటించారు. అయితే ఏ పార్టీ తరపున పోటీచేసెడిది చెప్పలేదు. తనకు నచ్చిన పార్టీలో చేరతానని, ఏ పార్టీ ముందుకు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని చెబుతూ వచ్చారు. అయితే ఆయన తిరిగి టిడిపి, బీజేపీలలో చేరేందుకు ప్రయత్నాలు చేసిన్నట్లు తెలుస్తున్నది.
చివరకు అధికార పార్టీ వైసిపి ఆహ్వానం కోసం వేచి చూసిన్నట్లు ఆయన చేసిన కొన్ని ప్రకటనలు వెల్లడి చేస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా ఆయన పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడు తానే ఓ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తి కలిగిస్తున్నది.
ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటమే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు. అవినీతికి ఏమాత్రం తావులేకుండా, విలువలతో కూడినా రాజకీయాన్ని పరిచయం చేసేందుకు తాను పార్టీ పెడుతున్నట్టు లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.
“రాజకీయాల అంటే మోసం కాదు. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశా. అన్ని వర్గాల్ని కలిసి.. అందరి అభిప్రాయాలు తీసుకున్నా. ప్రత్యేక హోదా రానందువల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా సాదనలో విఫలం అయ్యాయి” అంటూ తాను పార్టీ ఏర్పాటు చేసేందుకు దారితీసిన పరిస్థితులను వివరించారు.
ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. శాంతి భద్రతలు, మానవ హక్కులు కల్పించేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని తెలిపారు. వీళ్లు తిన్నారని వాళ్లు, వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారు. ఎవరూ అవినీతికి పాల్పడేందుకు వీల్లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని వెల్లడించారు.
అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమార్పేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. యువతరానికి అద్భుత ఉపాధి కల్పించడానికి.. ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అంటూ వీవీ లక్ష్మీనారాయణ ఉద్వేగంగా ప్రసంగించారు.
మరోవైపు, అదేరోజున ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్ కొత్త పార్టీని ప్రకటించారు. “తెలుగు సేన పార్టీ” పేరుతో సత్యారెడ్డి కొత్త పార్టీని స్థాపించటం గమనార్హం.=ఆయన పార్టీని ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
