భారత్ అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. ఇటీవల ఇంగ్లాండ్‌పై రికార్డు విజయం సాధించిన భారత మహిళా జట్టు ఈ సారి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. వాంఖడే వేదికగా జరిగిన ఏకైక టెస్టులో ఆసీస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. టెస్టు ఫార్మాట్లో కంగారూలపై భారత మహిళా జట్టుకు ఇదే తొలి విజయం.
ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికే ఓపెనర్ షెఫాలీ వర్మ ఔటయినప్పటికీ ఆ తర్వాత రిచా ఘోష్, స్మృతి మందాన జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.
మరోవైపు టెస్టుల్లో ఆస్ట్రేలియాకు గత పదేళ్లలో ఇదే తొలి ఓటమి. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరు 233/5తో ఆదివారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 261 పరుగులకే ఆలౌటైంది. చివరి అయిదు వికెట్లు 28 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
భారత బౌలర్లలో స్నేహ రాణా నాలుగు వికెట్లతో సత్తాచాటింది. హర్మన్ ప్రీత్, గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ బ్యాటర్లలో తాహితా మెక్‌గ్రాత్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
తొలి ఓవర్లోనే షెఫాలీ వర్మ (4) ఔటైంది. కాసేపటికీ రిచా ఘోష్ (13) కూడా పెవిలియన్‌కు చేరింది. తర్వాత భారత బ్యాటర్లు ఆసీస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్మృతి మంధాన (38*), జెమిమా రోడ్రిగ్స్ (12*) జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్, అష్లీ గార్డెనర్ చెరో వికెట్ తీశారు.
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. తాహిలా మెక్‌గ్రాత్ (50), మూనీ (40) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో పూజ నాలుగు, స్నేహ రాణా మూడు, దీప్తి శర్శ రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా 406 పరుగులు చేసింది. దీప్తి శర్మ (78), స్మృతి మంధాన (74), జెమిమా రోడ్రిగ్స్ (73), రిచా ఘోష్ (52)అర్ధశతకాలు సాధించారు. ఆసీస్ బౌలర్లలో అష్లీ నాలుగు వికెట్లు తీసింది.
ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన ‘ఆఫ్ స్పిన్నర్’ స్నేహ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 7 వికెట్లు తీసి టీమిండియా విజయంలో స్నేహ ముఖ్యపాత్ర పోషించింది. ఆసీస్ బ్యాట్స్ ఉమెన్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టింది. స్పిన్ బౌలింగ్‌కు పిచ్ అనుకూలంగా మారడాన్ని చక్కగా ఉపయోగించుకుంది.