తెలంగాణలోని జిల్లాలకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, ప్రభుత్వ పథకాలు, పాలనను ప్రజలకు అందించేందుకు ఈ ఇంఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోనున్నారు. ఇక మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది.
హైదరాబాద్ జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లాకు ఇంఛార్జ్ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అవకాశం కల్పించారు. ఇక వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు ఇంఛార్జ్ మినిస్టర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా దామోదర రాజనర్సింహను నియమించారు.
ఖమ్మం జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అవకాశం కల్పించారు. మెదక్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ నియామకం అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ధనసరి అనసూయ సీతక్క నియమించారు. నల్గొండ జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు నియమితులు అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావుకు అవకాశం కల్పించారు.
18 గంటలు పనిచేయాల్సిందే
కాగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రోజుకు 18 గంటలు పనిచేయాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలా పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలని, పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్, డీజీపీకి చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పారు. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన భేటీలో తెలిపారు.
6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు సభల నిర్వహణ ఉంటుందని తెలిపారు.
ఇక ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారు. మహాలక్ష్మి, కొత్త రేషన్ కార్డులు, ధరణి పోర్టల్ పై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.