కేరళలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం శబరిమలలో భక్తుల సందడి కొనసాగుతుంది. ఇసుకేస్తే రాలనంత మంది జనం కేరళ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు చేరుకుంటున్నారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శిచుకోవటానికి వచ్చిన భక్తులతో శబరి గిరులు కిటకిటలాడుతున్నాయి.
ఇరుముడి సమర్పించేందుకు సమయం దగ్గర పడుతుండడంతో మరింత మంది భక్తులు వస్తున్నారు. దీంతో శబరిమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి భక్తుల రాక భారీగా ఉన్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాలధారులు శబరిమలకు చేరుకుంటున్నారు.
రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు, అయ్యప్ప మాలధారులు స్వామివారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు, స్వాములు కాలినడకనే శబరిమలకు వెళ్తున్నారు. ఆదివారం ఒక్కరోజే శబరిమలలో అయ్యప్ప స్వామిని ఒక లక్ష 969 మంది అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు.
గత పది రోజులుగా చూసుకుంటే ఆదివారం రోజు అత్యంత రద్దీ శబరిమలలో కొనసాగింది. మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఇప్పటికే మండల పూజ కోసం దాదాపు 2700 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే పోలీసులు, ఆర్ ఆర్ ఎఫ్, సిఆర్పిఎఫ్, బాంబు స్క్వాడ్, ఎన్ డీ ఆర్ ఎఫ్ సహా 2150 మంది సిబ్బంది సన్నిధానం పరిసర ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. యాత్రికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం కోసం డీఎస్పీల నేతృత్వంలో పదిమంది డిఎస్పీలు, 35 మంది ఇన్స్పెక్టర్లు 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐ లతో పది డివిజన్ల పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు.
శబరిమలకు యాత్రికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, శబరిమలకు భక్తులు తాకిడితో కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు మాస్కులు ధరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని భక్తులకు సూచనలు చేస్తున్నారు.