ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్సీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరటం సంతోషంగా ఉందని చెప్పారు.
మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు.
తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు.
ప్రజా సేవ చేసేందుకు తాను రాజకీయంలోకి అడుగు పెట్టినానని, తనకు అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంబటి రాయుడు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు.