గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర హోంశాఖ సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఉగ్రవాది ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. పంజాబ్‌లో దోపిడీలు, సరిహద్దుల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు.
గోల్డీ బ్రార్ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ కెనడాకు మకాం మార్చాడు. అతనిపై హత్య, హత్యాయత్నం, ఆయుధాల స్మగ్లింగ్ సహా దాదాపు 13 కేసులు నమోదయ్యాయి. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది.
సెప్టెంబర్ నెలలో గోల్డీ బ్రార్ పోలీసులపై సైతం దాడికి పాల్పడ్డాడు. ఇంతకు ముందు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లఖ్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో జరిగిన ఆర్పీజీ దాడికి లాండా ప్రధాన సూత్రధారి. గతంలో లాండాపై ఎన్ఐఏ రూ.15 లక్షల రివార్డును ప్రకటించింది.
లఖ్బీర్ స్వస్థలం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లా హరికే గ్రామం. ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి. అతను 2017లో కెనడాకు పారిపోయాడు.