తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఏరో స్పేస్ సిఈవో ఆశీష్ రాజ్ వన్షిలు సెక్రటేరియట్లో బుధవారం చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని చెప్పారు.
రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని చెప్పారు. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన శ్రీమతి కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
కాగా, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్ సైతం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా సంస్థ కీలక భాగస్వామి అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆ కంపెనీ ఏర్పాటు చేయతలపెట్టిన పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్ నిర్వహణకు ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో అమరరాజా ఒప్పందు కుదుర్చుకుంది.