దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా బదులు తీర్చుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా రెండో టెస్టులో మాత్రం అదరగొట్టింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 7 వికెట్లు తీసి, విజయంతో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 153 పరుగులు చేసింది. 98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీతో రాణించడంతో 176 పరుగులు చేసింది. భారత్ ముందు 79 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
స్వల్వ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ గెలుపొందింది. యశస్వి జైశ్వాల్ 23 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది.
రెండో టెస్టులో భారత్ మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో సత్తాచాటగా.. రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కకావికలం చేశాడు.
తొలి రోజే 23 వికెట్లు పడిన కేప్‌టౌన్ పిచ్‌పై రెండో రోజే ఫలితం తేలిపోయింది. ఊహించినట్టుగానే టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. సెషన్ సెషన్‌కు ఆధిపత్యం మారుతూ వచ్చిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల విజృంభణతో సఫారీ జట్టు చేతులెత్తేసింది.
బుమ్రా ఆరు వికెట్లతో సఫారీల నడ్డి విరవడంతో రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 176 రన్స్‌కే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్ మొత్తంగా 5 సెషన్లలోనే పూర్తి కావడం గమనార్హం. మ్యాచ్ మొత్తంగా 107 ఓవర్లలోనే పూర్తి కావడం గమనార్హం. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇలా ముగియడం ఇదే తొలిసారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
