భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆదిత్య-ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ లక్షిత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.
భూమి నుంచి సూర్యుడి దిశలో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఆదిత్య-ఎల్ 1 ను ప్రవేశపెట్టారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడి నుంచి సూర్యుడిని పర్యవేక్షించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఇస్రో తొలి సౌర మిషన్ ఆదిత్య-ఎల్1 చివరి కక్ష్యలోకి చేరుకుంది. ఆదిత్య ఎల్1 సోలార్ అబ్జర్వేటరీని గత ఏడాది సెప్టెంబర్ లో ఇస్రో ప్రయోగించింది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఏఎన్ఐతో మాట్లాడుతూ… జనవరి 6 సాయంత్రం 4 గంటలకు ఆదిత్య-ఎల్1 లగ్రాంజ్ పాయింట్‌కి చేరుకుంటుందని తెలిపారు.
గత సంవత్సరం సెప్టెంబరు 2న ప్రయోగించిన ఈ వ్యోమనౌక ట్రాన్స్-లగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (టిఎల్1I) కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. లగ్రాంజ్ పాయింట్ భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ బలాలు సమతౌల్య స్థితికి చేరుకునే హాలో ప్రాంతం.
ఆదిత్య-ఎల్1 లగ్రాంజ్ పాయింట్ ను చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్ మరో అరుదైన ఘనత సాధించిందని ఎక్స్ లో పోస్టు చేశారు. భారత్ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 తన గమ్యస్థానాన్ని చేరుకుందని ప్రకటించారు.
ఈ పరిశోధన అంతరిక్ష యాత్రల్లో భారత శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ అద్భుత విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే భారత్ ప్రయాణం కొనసాగుతుందని అని ప్రధాని మోదీ తెలిపారు.
ఆదిత్య-ఎల్1 పేలోడ్ల సూట్లు కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణం, సోలార్ డైనమిక్స్ పై అధ్యయనం చేయడానికి, సూర్యుని అత్యంత కీలకమైన సమాచారం అందించడానికి ఈ ప్రయోగం సహకరిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.