టిడిపికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడని, ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అంటూ కొనియాడారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నానని కేశినేని నాని వెల్లడించారు. షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు, చంద్రబాబు అమరావతి కట్టాడు అనిపించుకోవాలని తాపత్రయం పడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధి సాధ్యం కాదని ఆనాడే చెప్పినా వినలేదని పేర్కొంటూ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 40 సీట్లు కూడా రావట్లేదని స్పష్టం చేశారు.
2013 జనవరి నుంచి టీడీపీ అభివృద్ధి కోసం పని చేస్తూ వచ్చానని, 2014 ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజస్కందాల మీద వేసుకుని గెలిపించానని పేర్కొన్నారు. “తన సొంత వ్యాపార సంస్థ కన్నా టీడీపీ గెలుపే ముఖ్యంగా చేసినా, 2019 ఎన్నికల సమయంలో తనకు సీటు ఇచ్చేందుకు ఇబ్బంది పెట్టారని, ప్రజాగ్రహం చూసి ఆ తర్వాత సీటు కేటాయించారని గుర్తు చేశారు.
“నేను అక్రమ సంపాదనకు ఆశపడకుండా పార్టీ, ప్రాంతం కోసం పనిచేశాను. వ్యాపారం మానుకున్నా.. ఆస్తులు అమ్ముకున్నా. హైదరాబాద్ లో రెండు వేల కోట్లు ఆస్తులు నేను అమ్ముకున్నాను. కొన్ని విషయాలలో చంద్రబాబు నా పట్ల ప్రవర్తించిన తీరు వల్ల నేను వ్యాపారం వదిలేశాను” అని తెలిపారు.
2019 ఎన్నికలలో నారా లోకేశ్ ఓడిపోయినా తాను ఎంపీగా ఇక్కడ గెలిచి, ప్రజల అభిమానం పొందడంతో వారి మనుషులను పెట్ తనను చాలా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. మేయర్ ఎన్నికలు వచ్చిన సమయంలో తన కుటుంబం నుంచి ఒకరు ఉంటే బాగుంటుందని ఒత్తిడి తేవడంతో టాటా సంస్థల్లో పనిచేస్తున్న కుమార్తె శ్వేతను తీసుకువచ్చి పోటీ చేయించానని తెలిపారు.
“ఎంపీ నానిని చెప్పు తీసుకుని కొడతాను అని ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ అన్నాడు. ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు నన్ను గొట్టం గాడు అన్నాడు. పార్టీ నుంచి ఈ విమర్శలపై కనీసం స్పందన లేదు.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీలో ఉంటూ ఎన్నో అవమానాలు భరించానని చెప్పుకొచ్చారు.
మీకు ఇష్టం లేకపోతే తప్పుకుంటానని చంద్రబాబు ముందే చెప్పానని, ఆరోజు నువ్వే ఉండాలని అన్నారని తెలిపారు. నువ్వే ఎంపీగా ఉంటేనే.. పార్టీకి మంచి జరుగుతుందని ఆయన చెప్పారని గుర్తు చేశారు.
తన కుటుంబ సభ్యుడికి ఎంపీ అడిగితే ఇవ్వడంలో తప్పులేదంటూ విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావు పేట ఎంపీ సీట్లలో కమ్మవారే పోటీ చేస్తారని పేర్కొన్నారు. అయితే, రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేటలలో ఆ విధంగా ఇవ్వకుండా ఇక్కడ తనకు పోటీగా వేరొకరి టికెట్ ఇవ్వడం ఏమిటని కేశినేని నాని ప్రశ్నించారు.