ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ స్వగ్రామంలో వ్యవసాయంపై మక్కువ చూపే మల్లికార్జున్ రెడ్డి లాంటి వారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా యువతకు, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. గురువారం భారత్ వికసిత్ సంకల్ప్ యాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని న్యూఢిల్లీ నుండి వర్చువల్ గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.
తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, మేఘాలయ, మహరాష్ట్ర, రాష్ట్రాలకు చెందిన వారితో మాట్లాడుతూ ప్రధాని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మొదటగా చొప్పదండి మండలం పెద్ద కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డితో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి కార్పోరేట్ సంస్థలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న మల్లికార్జున్ ఎంతో మందికి ఆదర్శమని ప్రధాని అభివర్ణించారు.
అనంతరం ప్రధానమంత్రి యోజన పథకాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందిన లబ్ధిని గురించి వివరాలను, మల్లికార్జున్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే సెమినార్ ల ద్వారా మల్లికార్జున్ లాంటి వారు యువతకు స్వయం అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
వ్యవసాయంలో భర్తకు చేదోడుగా నిలుస్తున్న మల్లికార్జున భార్య లాంటి వారు భారత నారి శక్తులని అభివర్ణించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పలు పథకాలను వివరించారు.