జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ హాలీడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాయాలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది.
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆఫీసులు మూసి ఉంటాయని పేర్కొంది. ఉద్యోగుల మనోభావాలు, అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
‘ఉద్యోగుల మనోభావాలు, వారి నుంచి వచ్చిన అభ్యర్థనల దృష్ట్యా రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు 2024 జనవరి 22న మధ్యాహ్నం 2:30 గంటల వరకు హాఫ్ డే మూసివేయాలి’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు, కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటించాయి. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, గోవా, ఛత్తీస్గఢ్లో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలను కూడా జనవరి 22న మూసివేయాలని అక్కడ ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి.
కాగా, హిందువుల దశాబ్దాల కల అయోధ్యలోని రామమందిరం ఎట్టకేలకు నెరవేరింది. సుప్రీంకోర్టు తీర్పుతో వివాదానికి తెరపడటంతో మూడున్నరేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
అయోధ్యకు శ్రీవారి లడ్డూ ప్రసాదం
అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.
ఇందుకోసం గురువారం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివ ప్రసాద్, పోటు ఏఈవో శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.