కరోనా కట్టడికి రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. టెస్టింగ్ తో పాటు ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కోరారు.
లోకల్ కంటైన్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెబుతూ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. దేశంలో 10 రోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు.
దేశంలో కరోనా పరిస్థితిని వైద్య నిపుణులు నిరంతరం సమీక్షిస్తున్నారన్న ప్రధాని మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ప్రధాని పేర్కొన్నారు.
కరోనా కట్టడి కోసం వ్యూహాలు రూపొందించే ముందు సామాన్యుల జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని సూచించారు. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కరోనా కట్టడి కోసం అవసరాన్నిబట్టి అక్కడికక్కడ స్థానిక ఆంక్షలు విధించడం మంచిదని అభిప్రాయపడ్డారు.
ఈ శతాబ్దిలోనే అతిపెద్ద మహమ్మారితో భారతదేశం చేస్తున్న యుద్ధం 3వ సంవత్సరంలోకి ప్రవేశించిందని గుర్తుచేస్తూ, 130 కోట్ల మంది భారతీయులు ఖచ్చితంగా కరోనాపై విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఒమిక్రాన్’ గురించి ఇంతకుముందున్న సందేహాలు ఇప్పుడు క్రమక్రమంగా తీరుతున్నాయని, ఈ వేరియంట్ మునుపటి వేరియంట్ల కంటే చాలా రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని పేర్కొన్నారు.
దీన్ని ఎదుర్కొనే క్రమంలో అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, కానీ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ పండుగల సీజన్లో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత ఎక్కడా తగ్గకుండా చూడాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకటిలా ముందస్తు, సమయానుకూల, సమష్టి విధానాలతో పోరాడాలని పిలుపునిచ్చారు.
కరోనా కట్టిడిలో శ్రమించడమే ఏకైక మార్గమని, విజయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ప్రధాని మోదీ తెలిపారు. మనం కరోనా వ్యాప్తిని ఎంత ఎక్కువగా నిలువరించగలమో సమస్య అంత తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా తమ పనితీరును నిరూపించుకుంటున్నాయని గుర్తు చేశారు.
దేశంలో దాదాపు 92% జనాభాకు మొదటి డోసు అందించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. దేశంలో 2వ డోస్ కవరేజ్ కూడా దాదాపు 70 శాతానికి చేరుకుందని చెప్పారు. 10 రోజుల వ్యవధిలో, దేశంలో దాదాపు 30 మిలియన్ల మంది కౌమారదశ పిల్లలకు టీకాలు అందించగలిగామని అన్నారు. ఇది భారతదేశ సామర్థ్యాన్ని చూపుతోందని, సవాళ్లను ఎదుర్కోవడంలో మన సంసిద్ధతను చాటుతుందని వెల్లడించారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వయోధికులకు ఎంత త్వరగా ముందుజాగ్రత్త మోతాదును అందిస్తే, మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యం అంతగా పెరుగుతుందని పేర్కొన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ కోసం ‘హర్ ఘర్ దస్తక్’ ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాబొయే కొత్త వేరియంట్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పణ్ణుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఆరోగ్య వసతులు, మౌలిక సదుపాయాలను పెంపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 23 వేల కోట్ల ప్యాకేజిని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవడంపై మెచ్చుకున్నారు. అయితే కరోనాను ఓడించే క్రమంలో ఈ వసతుల కల్పన మరింతగా పెంచుకుంటూ వెళ్లాల్సిందేనని, కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అన్నారు.