రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అస్సాంలో అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నగావ్ జిల్లాలోని బోర్దువాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు గాను రాహుల్‌ని అధికారులు అనుమతించలేదు.
రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను సైతం హైబోరాగావ్ వద్ద అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ.. తనని అడ్డుకోవడానికి గల కారణాలేంటని ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. అటు.. మహిళా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. రాహుల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
‘‘మేము ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నాం. కానీ.. మమ్మల్ని అడ్డుకున్నారు. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేం చేశాను?’’ అని రాహుల్ గాంధీ తారాస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలనేది కూడా ప్రధాని మోదీ నిర్ణయిస్తారా? అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తాము కేవలం ప్రార్థన చేసుకోవడానికే ఈ ఆలయానికి వచ్చామని, ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలావుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆలయ దర్శనానికి రాహుల్ గాంధీకి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం రాహుల్‌గాంధీ షెడ్యూల్ ప్రకారం మోరిగావ్ జిల్లాలో పాదయాత్రకు ఉపక్రమించారు. కానీ పాదయాత్రకు జిల్లా అధికార యంత్రాంగం బ్రేకులు వేసింది. అదేవిధంగా సాయంత్రం బిహుతోలిలో నిర్వహించతలపెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు కూడా జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉన్నందునే తాము రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అసోం ప్రజలు తన యాత్రలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
అంతకుముందు నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడుల్లోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. కాగా, అసోంలోని 17 జిల్లాల మీదుగా 833 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది.
ఇలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాలయ ప్రారంభ వేడుకకు రాహుల్ గాంధీని ఎందుకు ఆహ్వానించలేదని ఓ విలేకరి ప్రశ్నకు అసోం బదులిస్తూ మీరెందుకు రావణుడి గురించి మాట్లాడుతున్నారని ఎదురు ప్రశ్న వేశారు. ఈరోజు రాముడి గురించి మాట్లాడాలని, 500 ఏండ్ల తర్వాత ఇవాళ రాముడి గురించి మాట్లాడుకోవడం మంచిదని సూచించారు. కనీసం ఈరోజు రావణుడి గురించి మమ్మల్ని మాట్లాడనివ్వకండని అసోం సీఎం పేర్కొన్నారు.