తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
ఈ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగానే కలిసినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
బొటాబొటి ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండే ఈ ప్రభుత్వం తొందరలోనే కూలిపోవడం ఖాయం అంటూ పలువురు బిఆర్ఎస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇటువంటి వాఖ్యలపై ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువంటి ప్రయత్నాలు చేస్తే తాను ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
పరోక్షంగా పలువురు బిఆర్ఎస్ ఎమ్యెలు తనతో టచ్ లో ఉన్నారనే సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న ఎంఐఎం ఎమ్యెల్యేలతో సాన్నిహిత్యం ఏర్పోర్హ్చుకో గలిగారు కూడా.
ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.