తమది ప్రజా పాలనా అని, ఎవరైనా నిరసనలు చేసుకోవచ్చని అధికారం చేబడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పైగా, తమది దేశంలోనే `ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటూ తెలంగాణ పోలీసులు ఘనత చెప్పుకొంటుంటారు. అయితే, నిరసనలు, ఆందోళనలు జరిగినప్పుడు మాత్రం అదేంటో నిరసనకారులపై తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంటారు.
నిరసన వ్యక్తం చేసేది రాజకీయ నాయకులు కాకుండా విద్యార్థులో, రైతులో, మహిళలో అయితే మాత్రం.. వారిపట్ల కొంచెం క్రూరంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి సాక్ష్యమే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఎబివిపి రాష్త్ర కార్యదర్శి ఝాన్సీరాణి ని ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇద్దరు మహిళా పోలీసులు జుట్టుపట్టుకుని ఈడ్చుకొంటూ రోడ్డుపై వెడుతూ ఉండటం సభ్యసమాజం సిగ్గుపడెటట్లు చేస్తున్నది.
ఉద్యానవన యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణంకోసం బదలాయిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.55ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్న ఎబివిపి విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే. ఏబీవీపీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పోలీసులను తప్పించుకుని పరుగెత్తారు.
ఆమెను పట్టుకునేందుకు ఇద్దరు మహిళా పోలీసులు స్కూటీపై ఆమెను వెంబడించారు. దగ్గరికి చేరుకోగానే వెనుక ఉన్న పోలీసు ఝాన్సిని ఆపే ప్రయత్నంలో జుట్టును పట్టుకున్నారు. అయితే.. స్కూటీ రన్నింగ్లో ఉండటంతో.. ఝాన్సి కింద పడిపోయారు. అయినప్పటికీ ఆ పోలీసు జుట్టు వదలకుండా అలాగే పట్టుకున్నారు.
అయితే ముందున్న పోలీసు బండిని వెంటనే ఆపేసింది. ఈ ఘటనలో విద్యార్థి నాయకురాలికి స్వల్ప గాయాలయ్యాయి. బండిని వెంటనే ఆపేయటంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో.. ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఒక విద్యార్థి నాయకురాలి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించాలా? అని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం కూడా కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లటమేంటని మండిపడుతున్నారు.
ఫ్రెండ్లీ పోలీసులమని చెబుతూ ఇలా కర్కషంగా వ్యవహరించటంపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. పోలీసులపై, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.