సినీ ప్రముఖుడు మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం (2024) వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని కొణిదెల చిరంజీవికి ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని సైతం పద్మ విభూషణ్ పురస్కారం వరించింది.
ఈ ఏడాది మొత్తం ఐదుగురు ప్రముఖులకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన తమిళ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్‌కు పద్మ భూషణ్ ప్రకటించారు. సినీ రంగం నుంచి ఉషా ఉతుప్ (సింగర్), మిథున్ చక్రవర్తి ‘పద్మ భూషణ్’ అవార్డులకు ఎంపికయ్యారు.
ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బీహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ థాకూర్ (మరణానంతరం) ప్రకటించారు.
కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటిస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ కేంద్రం ప్రభుత్వం నేడు ప్రకటించిన పద్మ విభూషణ్ జాబితాలో చిరంజీవి పేరు ఉండటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వెంకయ్యనాయుడికి సైతం అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 1987లో స్వయంకృషి, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. 2016లో ఆయణ్ని రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1987లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి దక్షిణ భారతదేశం నుంచి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం.
పద్మ విభూషణ్ 2024 పురస్కారాలు:
వైజయంతీమాల బాలి (తమిళనాడు) – కళలు
కొణిదెల చిరంజీవి (ఆంధ్రప్రదేశ్) – కళలు
ఎం వెంకయ్యనాయుడు (ఆంధ్రప్రదేశ్) – ప్రజా సంబంధాలు
బిందేశ్వర్ పాఠక్ (మరణాంనతరం) (బీహార్) – సామాజిక సేవ
పద్మా సుబ్రమణ్యం (తమిళనాడు) – కళలు
తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ
ఈ ఏడాది మొత్తం 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురిని పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి, తెలంగాణ నుంచి బుర్రకథ వీణ కళాకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారి (కళలు), కేతావత్ సోమ్లాల్ (సాహిత్యం, విద్య), కూరెళ్ల విఠలాచార్య (సాహిత్యం, విద్య)కు పద్మ శ్రీ అవార్డును ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి 8 మందిని పద్మ పురస్కారాలు వరించడం విశేషం.
పద్మ భూషణ్ పురస్కారాలు 2024:
1) ఎం. ఫాతిమా బీవి (కేరళ) – ప్రజా వ్యవహారాలు
2) హర్మస్‌జీ ఎన్ కామా (మహారాష్ట్ర) – సాహిత్యం, విద్య, జర్నలిజం
3) మిథున్ చక్రవర్తి (పశ్చిమ బెంగాల్) – కళలు
4) సీతారామ్ జిందాల్ (కర్ణాటక) – వాణిజ్యం, పరిశ్రమలు
5) యువాంగ్ లీయూ (తైవాన్) – వాణిజ్యం, పరిశ్రమలు
6) అశ్విన్ బాలచంద్ మెహతా (మహారాష్ట్ర) – వైద్యం
7) సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం) (పశ్చిమ బెంగాల్) – ప్రజా వ్యవహారాలు
8) రామ్ నాయక్ (మహారాష్ట్ర) – ప్రజా వ్యవహారాలు
9) తేజస్ మధుసూదన్ పటేల్ (గుజరాత్) – వైద్యం
10) ఓలంచేరి రాజగోపాల్ (కేరళ) – ప్రజా వ్యవహారాలు
11) దత్తాత్రేయ అంబాదాస్ మయాలు (మహారాష్ట్ర) – కళలు
12) తోగ్దాన్ రిన్పోచే (మరణానంతరం) (లడఖ్) – ఆధ్యాత్మికం
13) ప్యారేలాల్ శర్మ (మహారాష్ట్ర) – కళలు
14) చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (బీహార్) – వైద్యం
15) ఉషా ఉతుప్ (పశ్చిమబెంగాల్) – కళలు
16) కెప్టెన్ విజయ్‌కాంత్ (మరణానంతరం) (కళలు) – తమిళనాడు
17) కుందన్ వ్యాస్ (మహారాష్ట్ర) – సాహిత్యం, విద్య, జర్నలిజం