ఆంధ్ర ప్రదేశ్ కు కీలకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.
సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో పాటే సహాయ పునరావాస పనులు (ఆర్ఆండ్ఆర్) కూడా ఒకేసారి పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం, వెనుకబడిన జిల్లాల్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించేందుకు చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను కూడా పూర్తిచేస్తామని చెప్పారు.
వెలిగొండ రెండో టన్నెల్ పూర్తయిందని, 2024 సెప్టెంబరు నాటికి నల్లమల సాగర్‌లో నీటిని నిల్వ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీ పథకాల ద్వారా రూ.4,21,094 కోట్లను అందించామని తెలిపారు. 7000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం సెకీతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ సెక్యులరిజం, సోషలిజం, ప్రజాస్వామ్యం, గణతంత్ర విలువలను ప్రతిబింభిస్తూ నిర్మించిన 206 అడుగులు ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం రాజ్యాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న విధేయతకు నిదర్శనమని చెప్పారు. 56 నెలల కాలంలో ప్రతి గ్రామంలోనూ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు.
విద్యారంగంలోనూ అనేక మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇంటివద్దకే పాలన పేరుతో విప్లవాత్మక మార్పులు చేశామని, రేషన్ బియ్యం, పింఛన్లు ఇంటివద్దకే తీసుకెళ్లి అందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ప్రతి ఇంటికీ వైద్య సేవలు అందేలా చూస్తున్నామని వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ చేస్తున్నామన్నారు.
వికేంద్రీకరణ పేరుతో పరిపాలన సంస్కరణలు చేస్తామని చెబుతూ మైనార్టీల కోసం కళ్యాణమస్తు, షాదీతోఫా వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పగటిపూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.. పొదుపు సంఘాల మహిళలకు నాలుగు దశల్లో రుణమాఫీ చేశామన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో భూ వివాదాలు పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనర్రెడ్డితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.