టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తనను రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్ణయం ప్రకటన సమయంలో జయదేవ్ ఎమోషనల్ అయ్యారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
తనను కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు టార్గెట్ చేసాయని ఆరోపించారు. రాజకీయాల్లో ఉంటే తన పని తాను చేయలేకపోతున్నానని వాపోయారు. కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బంది అని మౌనంగా ఉండలేనని చెప్పారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని’ గల్లా జయదేవ్ స్పష్టంచేశారు. ఏపీలో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయని చెప్పుకొచ్చారు. అందుకనే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొల్పామని, విదేశాల్లో పరిశ్రమలను విస్తరిస్తున్నామని వివరించారు. రాజకీయాల్లో నుంచి వైగొలిగే పరిస్థితి వస్తుందని అనుకోలేదని వాపోయారు.
తాను రాజకీయంగా అన్నీ తట్టుకొని నిలబడ్డానని చెబుతూ అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా అని, అయితే, ఈ సారి పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా మాత్రమే వస్తానని వెల్లడించారు. ప్రాంతీయ పార్టీలలో పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలని పేర్కొంటూ రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మాట్లాడానని గుర్తు చేసారు.
దాంతో ఈడీ అధికారులు తనను పిలిచి బెదిరించారని ఆరోపించారు. తాను చట్ట ప్రకారమే వ్యాపారం చేస్తున్నానని, అయినా వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరని గల్లా స్పష్టం చేశారు. 70 ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ విభాగాలను ఆయుధాలుగా మార్చి తన పై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీటి పైన తాను న్యాయపరంగా ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. కోర్టులో గెలుస్తామనే నమ్మకం ఉందంటూ పోరాటంలో గెలిచినా యుద్ధంలో ఓడిన పరిస్థితి ఏర్పడిందంటూ గల్లా జయదేవ్ ఎమోషనల్ అయ్యారు.