విద్యార్థుల రిపోర్ట్ కార్డ్‌ను విజిటింగ్ కార్డ్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు.
భారత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్యార్థులే అని, మన విద్యార్థులే మన భవిష్యత్తును నిర్దేశిస్తారని ప్రధాని పేర్కొన్నారు. జీవితంలో పోటీ, సవాళ్లు సాధారణమే అని.. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుని ముందుకుసాగాలని చెప్పారు. స్నేహితుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని తెలిపారు.
“మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి. అది వారి భవిష్యత్తుకు హాని కలిగించవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డును విజిటింగ్ కార్డుగా భావిస్తారు. ఇది మంచిది కాదు. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు” అని ప్రధాని వారించారు.
ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని చెబుతూ తద్వారా పరీక్షలు బాగా రాయగలరని ప్రధాని తెలిపారు. విద్యార్థులపై తోటి స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల వల్ల, స్వీయ ప్రేరేపితంగా ఒత్తిళ్లు ఉంటుందని అంటూ వీటిని అధిగమించాలని సూచించారు.
విద్యార్థులు ఒత్తిడిని జయించి మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ పరీక్షలు రాసి విజయం సాధించాలని ప్రధాని కోరారు. విద్యాబోధనను టీచర్లు కేవలం ఉద్యోగంగా భావించకూడదని, విద్యార్థుల జీవితాలను మలిచే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని తెలిపారు. చాలా తెలివైన, కష్టపడే వ్యక్తులను మిత్రులుగా చేసుకోవాలని, అలాంటి ఫ్రెండ్స్‌తో ప్రేరణ పొందాలని, కెరీర్ విషయంలో చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలని, అప్పుడు ఎటువంటి గందరగోళం ఉండదని ప్రధాని సూచించారు.
ఏ విధానంలోనైనా క్రమ పద్ధతిలో పురోగతి సాధించాలని విద్యార్థులతో ప్రధాని మోదీ పేర్కొన్నారు. పేరెంట్స్, టీచర్లు, బంధువులు ఎవరు కూడా విద్యార్థులపై పదేపదే నెగటివ్ పోలికలు చేయకూడదని, ఎందుకంటే అది ఆ విద్యార్థి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఆ పోలికల వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా చాలా సున్నిత విధానంలో సంభాషణలు చేయాలని చెప్పారు.
టీచర్లు, విద్యార్థుల మధ్య బంధం ఎలా ఉండాలంటే, ఇది కేవలం సబ్జెక్ట్ సంబంధిత రిలేషన్ మాత్రమే కాదు అని, అంతకన్నా ఎక్కువే అన్న భావన విద్యార్థుల్లో రావాలని ప్రధాని తెలిపారు. టీచర్లు, స్టూడెంట్ల మధ్య రిలేషన్ చాలా గాఢంగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. తమలో ఉన్న వత్తిళ్లు, సమస్యలు, అభద్రతా అంశాలను విద్యార్థులు చాలా ధైర్యంగా టీచర్లతో చర్చించే రీతిలో వారి మధ్య రిలేషన్ ఉండాలని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలను విని వాళ్ల బాధలను టీచర్లు తీర్చితే అప్పుడు ఆ విద్యార్థులు చాలా ఎదుగుతారని ప్రధాని తెలిపారు. ఈసారి పరీక్షా పే చర్చా కార్యక్రమానికి ప్రతి రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులను, ఓ టీచర్‌ను ఆహ్వానించారు. కలా ఉత్సవ్ విజేతలను కూడా ఆహ్వానించారు. MyGov పోర్టల్ ద్వారా సుమారు 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.