జార్ఖండ్ రాజకీయం ఆసక్తికరంగా హైదరాబాద్ కు మారింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత పదవికి రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం శాసనసభా పక్ష నేత చంపాయ్ సోరెన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించారు.
67 ఏండ్ల చంపయీ సొరేన్ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రి. జార్ఖండ్ రాష్ర్టాభివృద్ధికి కట్టుబడి ఉంటానని, హేమంత్ సొరేన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తానని ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాకు తెలిపారు. కుట్ర చేసి ఒక గిరిజన సీఎంను ఎలా అరెస్ట్ చేశారో దేశమంతా చూస్తున్నదన్నారు. అనంతరం తొలిసారిగా చంపయీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ నెల 5న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవ్వాలని నిర్ణయించింది.
చంపాయ్ సోరెన్ తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవడానికి 10 రోజుల సమయం గవర్నర్ ఇచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న జేఎంఎం – కాంగ్రెస్ కూటమి నేతలు అప్రమత్తమవుతున్నారు. ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలను చేపట్టారు.
39 మంది ఎమ్మెల్యేలను రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వీరంతా కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావు స్వాగతం పలికి శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌కు తరలించారు. ఈ క్యాంప్ వ్యవహారాలన్నీ టీపీసీసీ ముఖ్య నేతలు సమన్వయం చేస్తున్నట్లు తెలిసింది.
జార్ఖండ్‌లో బలపరీక్ష నిరూపణ వరకు ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌లోనే ఉండేలా చర్యలు చేపట్టింది జేఎంఎం – కాంగ్రెస్ కూటమి. జార్ఖండ్ లో ఉంటే ఎమ్మెల్యేలు చేజారే అవకాశం ఉంటుందని, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణకు తరలిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయని భావించి ఎమ్మెల్యేలను ఇక్కడికి తరలించారు. ఇందులో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలనిరూపం జరిగే సమయానికి ఎమ్మెల్యేలను జార్ఖండ్ కు తీసుకెళ్లనున్నారు.
ఇలా ఉండగా, భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపుతూ ప్రత్యేక ఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు సుప్రీంకోర్టులో హేమంత్ సొరేన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.