ఆమ్ ఆద్మీ పార్ టీ(ఆప్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం ఆయన నివాసానికి వెళ్లారు. తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించాలని పోలీసులు కేజ్రీవాల్‌ను కోరినట్లు వర్గాలు తెలిపాయి.
నోటీసులు అందచేసేందుకు శుక్రవారం కేజ్రీవాల్ నివాసంతోపాటు ఢిల్లీ మంత్రి ఆటిషి నివాసానికి కూడా పోలీసులు వెళ్లగా ఆ రెండు చోట్ల నోటీసులను స్వీకరించలేదని వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ ఆ సమయంలో తమ నివాసాలలో లేరు.
దీంతో నోటీసులు అందచేసేందుకు ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం మళ్లీ కేజ్రీవాల్ నివాసానికి వచ్చారని వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా ఆప్ ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభపెడుతోందంటూ చేసిన ఆరోపణలపై క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ తెలిపారు.
ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు తమ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని జనవరి 30న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బిజెపి స్పష్టం చేసింది. కేజ్రీవాల్ చేసిన తప్పుడు ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని బిజెపి డిమాండు చేసింది. కేజ్రీవాల్‌కు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసు అందచేశారని, తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను కేజ్రీవాల్ సమర్పించాలని, లేనిపక్షంలో క్రిమినల్ చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని సచ్దేవ తెలిపారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కావటం లేదని, సమన్లు స్వీకరించటం లేదని ఇక్కడి ఓ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిబ్రవరి 7న విచారణ చేపడతామని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రా తెలిపారు.
దాదాపు 65 వేల మందికి నకిలీ రోగులకు మొహల్లా క్లినిక్‌లలో గత ఏడాది రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వెల్లడించింది. రెండు ప్రైవేటు ల్యాబ్‌లు గతేడాది ఫిబ్రవరి-డిసెంబర్ మధ్య దాదాపు 22 లక్షల పరీక్షలు జరిపాయని, వీటిలో 65 వేల పరీక్షలు నకిలీవని, తప్పుడు డాటాతో వాటిని సృష్టించాయని అధికారులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ పరీక్షలు చేసినందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆ ల్యాబ్‌లకు రూ.4.63 కోట్లు చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు.