పెద్దలను గౌరవించుకుని కుటుంబ వ్యవస్థను పటిష్టపరచుకోవాలనే సందేశాన్ని సంక్రాంతి అందిస్తోందని, అందుకే సంక్రాంతిని పెద్దల పండుగగా, పెద్ద పండుగగా జరుపుకుంటారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా మెలగాలనేది భారతీయ పండుగల్లో ఉండే పరమార్థమన్న ఆయన, ఈతరం యువత పండుగల్లోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకుని, పండుగలు పబ్బాలను జరుపుకోవటంతో పాటు… మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న గౌరవ ఉపరాష్ట్రపతి, చెన్నై కోట్టూర్ పురంలోని తమ స్వగృహంలో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్టు పెద్దల ఆశ్రమంలో ఉన్న పెద్దలతో అంతర్జాల వేదిక ద్వారా సంభాషించారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రతి పండగకు ఓ పరమార్థం ఉంటుందన్న ఉపరాష్ట్రపతి, దాదాపుగా పండగలన్నీ అన్నదాతలు, పాడిపంటల కేంద్రంగానే ఉంటాయన్నారు. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కూడా కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నలు జరుపుకునే పండగలని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్య సంపదను తోటి సమాజంలో భాగస్వాములైన వారితో (హరిదాసులు, బుడగ జంగాలు తదితరులతో) పంచుకోవడంలో ఆనందాన్ని వెతుక్కునే అన్నదాతల గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే అవుతుందని పేర్కొన్నారు. అందుకే భారతదేశంలో రైతున్న అన్నగా, అన్నదాతగా, పుడమిని అమ్మగా పిలిచే గొప్ప సంస్కృతి ఉందని చెప్పారు.
సంక్రాంతిని ముఖ్యంగా పెద్దల పండుగగా జరుపుకుంటారన్న ఆయన, పెద్ద పండుగ నాడు తమ పెద్దలను స్మరించుకుంటూ, పూజలు నిర్వహించడం, వారి పేరుతో వస్త్రాలు అర్పించి, అవసరమైన వారికి అందించడం ఆనవాయితీ అని తెలిపారు. మన జీవితానికి కారణమైన పెద్దలను, మన ఆనందకరమైన జీవనానికి కారణమైన సమాజాన్ని గౌరవించుకోవాలనే గొప్ప అంతరార్ధం ఈ పండుగ సొంతమని తెలిపారు.
ముఖ్యంగా ప్రకృతిని, పుడమితల్లిని, పశుపక్ష్యాదులను సైతం గౌరవించుకోవడం, కాపాడుకోవడం ద్వారా వచ్చే ఆనందం చెప్పనలవి కానిదన్న ఆయన, ఈ సంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటి ప్రాధాన్యతను ముందు తరాలకు తెలియజేసే బాధ్యతను పెద్దలు తీసుకోవాలని అకాంక్షించారు.
పెద్దలను గౌరవించుకోవడం భారతీయ సంప్రదాయమన్న ఉపరాష్ట్రపతి, సంక్రాంతి పండుగ ప్రధానంగా పెద్దలను గౌరవించుకోవడం గురించి తెలియజేస్తుందని చెప్పారు.
కుటుంబంలో పిల్లలకు దిశానిర్దేశం చేయడంలోనూ, వారిని మనవైన విలువలతో ఉన్నతులుగా తీర్చిదిద్దడంలోనూ, క్లిష్టసమయాల్లో తమ అనుభవాల ద్వారా వారికి సూచనలు అందించడంలోనూ పెద్దల పోషించే పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. అందుకే ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ పెద్దలతో మాట్లాడటం ద్వారా తనకు సరికొత్త ప్రేరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ కారణంగానే భారతదేశానికి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతోందన్న ఉపరాష్ట్రపతి, ఈ వ్యవస్థలు బలంగా ఉంచుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పిల్లల ఎదుగుదల, మానసిక వికాసం గురించి అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధలను జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి, సమత, శాంతిసామరస్యాలున్న సమాజమే పురోగతి చెందుతుందని, వివక్షల్లేకుండా సమజంలోని ప్రతి ఒక్కరికీ చేయూతనందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకెళ్లే సమృద్ధ భారత నిర్మాణానికి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.