లోక్‌సభతో పాటు కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎలక్టోరల్(ఎన్నికల) బాండ్ల పథకంపై ఇటీవల సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
శనివారం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నట్టు చెప్పారు. ఈవీఎంలు లేకుండా ఎన్నికల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, తీర్పు వచ్చాక, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. పార్లమెంట్‌తోపాటు ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పరిశీలన పూర్తైందని, ఎన్నికల కోసం అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. ఈవీఎంలు అన్నింటినీ తనిఖీ చేసి.. పోలింగ్ కోసం రెడీ చేసినట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఈ 2 ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రత విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించి.. సూచనలు, సలహాలు ఇచ్చామని తెలిపారు.
ఎన్నికల వేళ ఉండే డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకు నిరంతరం తనిఖీలు చేస్తున్నామన, ప్రత్యేక సిబ్బందితో సోదాలు, దాడులు చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొరికిన డబ్బు చూస్తేనే ఏ స్థాయిలో తనిఖీలు చేపట్టామో అర్థం అవుతుందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించటానికి సర్వం సిద్ధం చేశామని.. షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.