ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించానని, అయితే ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెబుతూ తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
ఢిల్లీలో 2024 ఎన్నికల సన్నగా జరుగుతున్న రెండు రోజుల బీజేపీ జాతీయ సదస్సు ముగింపు సభలో మాట్లాడుతూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమనిచెబుతూ18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని గుర్తు చేశారు.
త్వరలో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. “అయేగా తో మోదీ (మళ్లీ వచ్చేది మోదీనే)” అన్న విషయం.. ప్రపంచ దేశాలకు కూడా తెలుసని పేర్కొన్నారు. “దేశంలో ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉన్నాయి. కానీ.. జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు.. నాకు ఇప్పటికే ఆహ్వానాలు అందుతున్నాయి. దీని అర్థం ఏంటి? మూడోసారి కూడా ఇండియాలో బీజేపీనే వస్తుందని ప్రపంచ దేశాలు కూడా నమ్మకంగా ఉన్నాయి,” అని మోదీ అన్నారు.
సబ్ కా సాత్.. సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ సూచించారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయనిచెబుతూ బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పనితీరును, దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మోదీ. “గత పదేళ్లల్లో దేశం అసాధారణ రీతిలో వృద్ధిచెందింది. ప్రతి సెక్టార్‌లోనూ దేశం అగ్రస్థానంలో ఉంది. ఇండియా.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. ఇందుకోసం.. రానున్న 5 ఏళ్లు చాలా కీలకం. రానున్న రోజుల్లో దేశం మరింత వేగంగా పరిగెత్తాలి,” అని మోదీ తెలిపారు.
రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు బీజేపీ నేతలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా.. ఆయనకు నిలువెత్తు పూలమాలను వేసి సత్కరించారు. మోదీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు