* రాహుల్ కు మతి చెడిందా?
వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే ‘మోదీ గ్యారంటీ’ అని అభివర్ణించారు. వారణాసి పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో భాగంగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
‘కాశీ.. ఇప్పుడు వారసత్వం, అభివృద్ధికి నమూనాగా కనిపిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల చుట్టూ ఆధునికత ఎలా అభివృద్ధి చెందిందో యావత్ ప్రపంచం చూస్తోంది. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి చిహ్నంగా భారత్ మారుతుంది. ఇదే మోదీ గ్యారంటీ’ అని ప్రధాని పేర్కొన్నారు. బనారస్ విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉందన్న ఆయన అమృత్ కాల్ వేళ వారు దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారనే విశ్వాసం కలుగుతోందని తెలిపారు.
కాశీకి ఇంతకుముందున్న సామర్థ్యం, రూపం నేడు మళ్లీ ఆవిష్కృతమవుతోందని ప్రధాని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.13వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.
సంత్ రవిదాస్ 647 జయంతి సందర్భంగా వారణాసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ విపక్ష కూటమి ‘ఇండియా’పై విరుచుకుపడ్డారు. అందులోని భాగస్వామ్య పక్షాలు కులతత్వం పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. వారి కుటుంబాల శ్రేయస్సు కోసమే ప్రయత్నిస్తుంటారని, దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం ఆలోచించరని విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.
కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయాలు చేస్తున్నారని ఇండియా బ్లాక్ నేతలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నత స్థానంలో ఉండటం వారికి ఏ మాత్రం ఇష్టం ఉండదని, దళిత, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల చిన్న చూపు ఉంటుందని వివరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారణాసిలో కొందరు యువకులు మద్యం సేవించి రహదారి మీద పడుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారణాసికి చెందిన యువత తాగి పడుకున్నారా..? అలా మాట్లాడిన వారికి మతి చెడింది. కాంగ్రెస్ యువరాజు తమ సొంత గడ్డకు చెందిన ప్రజలను అవమానించారు’ అంటూ మండిపడ్డారు.
గత రెండు దశాబ్దాలుగా మోదీని తిడుతున్నారు. ఇప్పుడు వారి నిరాశ, నిస్పృహను వారణాసి యువతపై చూపిస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఎక్కడ రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశారు. వారణాసి యువతకు రాహుల్ గాంధీ, ఇండియా కూటమి చేసిన అవమానాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
వారణాసి యువత ప్రతిభ చూసి వారు భయపడుతున్నారని విమర్శించారు. కాశీ, అయోధ్యలో జరిగిన అభివృద్ధి వారికి ఏ మాత్రం ఇష్టం లేదని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ఉత్తర ప్రదేశ్ చిక్కిందని మండిపడ్డారు. అవినీతితో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉత్తర ప్రదేశ్ నిలిచిందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వడం లేదని మోదీ విరుచుకుపడ్డారు.