వచ్చే ఐదేళ్లలో రూ. 1.25 లక్షల కోట్లతో వేలాది గోదాములు, గిడ్డంగులను నిర్మించడం ద్వారా సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసిన 11 గోదాములను ఆయన ప్రారంభించారు. అలాగే మరో 500 పీఏసీఎ్‌సలలో గోదాములు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘‘ ఈ రోజు మన రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ పథకాన్ని ప్రారంభించాం. దీని కింద దేశవ్యాప్తంగా వేలాది గిడ్డంగులు, గోదాముల నిర్మాణం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. దేశంలో నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాలులేని కారణంగా రైతులు భారీగా నష్టాలను భరించాల్సి వస్తోందని ఆయన తెలిపానరు.
‘‘గత ప్రభుత్వాలు ఈ సమస్యపై ఎప్పుడు దృష్టిసారించలేదు. కానీ ఈ రోజు పీఏసీఎ్‌సల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తున్నాం. రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఖర్చుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకం కింద వచ్చే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల స్టోరేజీ సామర్థ్యం సృష్టి జరుగుతుంది’’ అని ప్రధాని తెలిపారు.
భారీగా నిల్వ సదుపాయాలను సృష్టించడం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను గోదాములు/గిడ్డంగులలో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, దీనిపై సంస్థాగత రుణాన్ని పొందడానికి, మార్కెట్లో మంచి ధరలు వచ్చినప్పుడు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వంట నూనెలు, పప్పులు వంటి ఆహార ఉత్పత్తులతోపాటు ఫెర్టిలైజర్స్ దిగుమతులను తగ్గించే దిశగా పని చేయాలని సహకార సంస్థలను ప్రధాని కోరారు.
కోఆపరేటివ్స్లోని ఎన్నికల విధానంలో పారదర్శకతను తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ప్రధాని.. దీని వల్ల సహకార ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ‘‘సహకార్ సే సమృద్ధి’’ విజన్‌లో భాగంగా సహకార రంగాభివృద్ధి కోసం గత పదేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ప్రధాని తెలిపారు.
ఇందులో భాగంగా సహకార రంగం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టాన్ని సవరించామని, పీఏసీఎ్‌సలను కంప్యూటరీకరణ చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 18వేల పీఏసీఎ్‌సలను కంప్యూటరీకరించే ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభించారు.
రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పీవో) గురించి ప్రధాని మాట్లాడుతూ.. చిన్న రైతులు ఆంత్రప్రెన్యూర్లుగా మారుతున్నారని, తమ ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నారని చెప్పారు.
‘‘10వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటికే 8వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేశాం. వాటి విజయాన్ని ఇప్పుడు ప్రపంచ స్థాయిలో చర్చిస్తున్నారు. మత్స్య, పశుసంవర్ధక రంగాలు కూడా కోఆపరేటివ్స్ ద్వారా లబ్ధిపొందుతున్నాయి’’ అని ప్రధాని తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో 2 లక్షల పీఏసీఎ్‌సలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఉందని, ఇందులో మత్స్య, అనుబంధ వ్యవసాయ రంగాల్లోనే ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఆహారం, ఇంధన ఉత్పత్తులకు సంబంధించిన భారత్ దిగుమతుల బిల్లును తగ్గించేందుకు సహకార రంగం సహాయపడాలని చెప్పారు.
మన దేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు వీలుగా భారత్ దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల జాబితాను కోఆపరేటివ్స్ రూపొందించాలని, వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. వంట నూనెలు, ఫెర్టిలైజర్స్, ముడిచమురు దిగుమతులను తగ్గించడానికి సహకార సంస్థలు సహాయం చేయగలవని చెప్పారు.
ఈ ఏడాది ఆగస్టుకల్లా దాదాపు 65వేల పీఏసీఎ్‌సలను కంప్యూటరీకరణ చేయనున్నట్టు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దీని వల్ల వాటి సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. 65వేల పీఏసీఎ్‌సలలో ఇప్పటికే 18,000 పీఏసీఎ్‌సల కంప్యూటరీకరణ పూర్తయిందని, ఎన్నికలకన్నా ముందే 30వేల పీఏసీఎ్‌సల కంప్యూటరీకరణ జరుగుతుందని చెప్పారు. రూ.2,516 కోట్లతో పీఏసీఎ్‌సల కంప్యూటరీకరణకు గత ఏడాది జూన్‌లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.