జ్ఞానవాపిమసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని ఇటీవల వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది.
పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ ఈ రోజు తీర్పు ఇచ్చారు. జ్ఞానవాపి వివాదం నేపథ్యంలో 1993 నుంచి హిందువుల పూజలు నిలిచిపోయాయి. ఇటీవల వారణాసి కోర్టు తీర్పు ఇవ్వడంతో పూజలు ప్రారంభించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
పూజ క్రతువుల కోసం ఆర్చకుడిని నియమించాలని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్‌కు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో వ్యాస్ కా టెఖనా ఉంది. ఆ నేలమాలిగ వద్ద మహా శివుడు కొలువై ఉన్నారు. భక్తులు పూజలు చేయడం ప్రారంభించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.