భారత తీర రక్షక దళంలో శాశ్వత మహిళా కమిషన్ ఏర్పాటులో ఎందుకీ ఆలస్యం? వెంటనే స్పందిస్తారా? లేక మీరు చేయలేకపోతే, ఈ పనిని మేం చేస్తాం అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చురకలు పెట్టింది. కోస్ట్‌గార్డు దళంలో మహిళలను తీసుకోవడాన్ని వ్యతిరేకించే ధోరణితో ఉందని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది.
కోస్ట్ గార్డు మహిళా అధికారులకు కమిషన్ ఏర్పాటు తంతుపై ఎంతకాలం మీనమేషాలు అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేంద్రాన్ని మందలించింది. మహిళలను అలానే వదిలేయలేమన్న సర్వోన్నత న్యాయస్థానం.. మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాల్సిందేని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోకపోతే తామే (సుప్రీంకోర్టు) ఆ పని చేస్తుందని ధర్మాసనం తెలిపింది.
సంబంధిత విషయంపై కేంద్రంతరఫున న్యాయస్థానానికి వచ్చిన అటార్నీ జనరల్‌ను నిలదీశారు. దీనితో తాము ఈ విషయంలో అఫిడవిట్‌తో వివరణ ఇచ్చుకోవాలని చెపుతామని కేంద్రం న్యాయవాదులు తెలిపారు. సంబంధిత విషయంపై మార్చి 1 వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.
తమకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు గురించి కోస్ట్ గార్డు అధికారిణి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అర్హులైన మహిళలు నౌకాదళంలో చేరే ప్రక్రియను సజావు చేసేందుకు నియామకాల ఇతరత్రా కమిషన్ల మాదిరిగానే శాశ్వత కమిషన్ ఏర్పాటు అవసరం అని కోర్టు గార్డు ఉమెన్ ఆఫీసరు తెలిపారు.
అయితే కోస్ట్‌గార్డు దళం అనేది నౌకాదళానికి, సైన్యానికి సంబంధం లేకుండా పనిచేసే వ్యవస్థ అని అటార్నీ జనరల్ వివరించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి మాటలు పరిపాటి అయిందని, మహిళలు ఇప్పుడు సరిహద్దుల రక్షణకు కూడా దిగుతూ ఉంటే, తీర ప్రాంతాలను , బీచ్‌లను ఎందుకు కాపలా కాయలేరు? అని ప్రశ్నించింది.
ఓ వైపు నారీ శక్తి ఇతరత్రా మాటలకు దిగుతూ అంటూ గొప్ప మాటలు ఎందుకు? ఈ విషయంలో కూడా దీనిని చాటుకోండని ధర్మాసనం ఘాటుగా నిలదీసింది. కోస్ట్గార్డులలో మహిళకు స్థానం లేదనేది పాతముచ్చట అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. పిటిషనర్ ప్రియాంక త్యాగి తమకు న్యాయం కోసం ముందుగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ ఉపశమనం దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.