కేంద్ర మంత్రి, అమేథి ఎంపి స్మృతి ఇరానీ బుధవారం నెహ్రూ, గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. వారు 50 ఏళ్లకు పైగా అమేథిని అభివృద్ధి చేయలేదని, స్థానిక ప్రజలు నిరుపేదలుగా, నిస్సహాయులుగా ఉండిపోయి, చేతులు జోడించి తమను వేడుకోవాలన్నది వారి ధ్యేయమని స్మృతి ఇరానీ ఆరోపించారు.
అమేథి సమీపంలోని పాండేగంజ్ గ్రామంలో ఒక కార్యక్రమంలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ, ‘ఎంపిని కలుసుకోవడానికి ఇక్కడి ప్రజలు ఢిల్లీకి వెళుతుండే రోజులను కూడా అమేథి చూసింది. ఆ సమయంలో ఎంపిలు విదేశాలకు వెళ్లడమో లేక వారి భద్రత సిబ్బంది ప్రజలను లోనికి అనుమతించకపోడమో జరిగేది’ అని చెప్పారు.
‘స్థానిక ప్రజలు నిరుపేదలుగా, నిస్సహాయులుగా ఉండిపోయి, చేతులు జోడించి తమను వేడుకొనేలా చేయడానికే నామ్దార్లు (గాంధీ కుటుంబం) 50 ఏళ్ల పాటు అమేథిని అభివృద్ధి చేయలేదు’ అనిఆమె ఆక్షేపించారు.
‘వారి ఆలోచన ధోరణి కారణంగా అమేథిలోని లక్షా ఎనిమిది వేల కుటుంబాలకు ఇళ్లు లేవు. అంతే కాదు. నాలుగు లక్షల కుటుంబాలకు తాగు నీటికి కుళాయిలు లేవు. మూడు లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. ఇక్కడ నుంచి ఎన్నికైన ఎంపిలకు జనంతో సంబంధం లేదు. ఎంపిలు ఐదు సంవత్సరాలకు ఒకసారి అమేథికి వస్తుండేవారు’ అని ఆమె విమర్శించారు.
కాంగ్రెస్కు కంచుకోటగా ఒకప్పుడు పరిగణన పొందిన అమేథి నియోజకవర్గం నుంచి స్మృతి ఇరానీ 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై గెలుపొందారు.