ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల సమయంలో బిజెపి నుండి ముగ్గురు మంత్రులతో పాటు పది మంది వరకు శాసనసభ్యులు వరకు రాజీనామాలు చేసి ప్రతిపక్షం సమాజవాద్ పార్టీలో చేరడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
వెనుకబడిన వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే తమ ఈ రాజీనామాలకు కారణమని వారు పేర్కొంటున్నారు. కాగా పార్టీ నుండి జరుగుతున్న ఫిరాయింపుల పట్ల బిజెపి మౌనం పాటిస్తోంది.
గత ఎన్నికలలో వెనుకబడిన వర్గాలు లేదా యాదవేతర ఒబిసిల నేతలను ఆకట్టుకోవడం ద్వారా బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ సహితం అటువంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే బిజెపి విడుదల చేసిన తొలి జాబితా చూసిన వారికి జరిగిన నష్టాలను భర్తీ చేసుకొనేందుకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు అర్ధం అవుతుంది.
బిజెపి ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో 44 మంది ఓబీసీలకు అవకాశం ఇచ్చారు. అలాగే 43 మంది అగ్రవర్ణాల వారికి, 19 మంది ఎస్సీలకు సీట్లు కేటాయించారు. ఈ జాబితాలో 63 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీజేపీ యూపీ ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలి జాబితాను విడుదల చేస్తూ జనరల్ కేటగిరీ సీట్లలో కూడా దళితలను బరిలో నిలుపుతున్నామని వెల్లడించారు. తొలి జాబితాలో ఓబీసీలు, ఎస్సీలు 60 శాతం వరకు ఉన్నారని వివరించారు.
బిజెపి ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవచ్చని సూచనప్రాయంగానైనా తెలిసి వుండడం, కుల కారణాలు ఇటీవలి ఫిరాయింపులకు కారణాలని ప్రముఖ జర్నలిస్టు రతన్మణి లాల్ పేర్కొన్నారు. ఇప్పుడే ఏం చెప్పినా అది తొందరపాటే అవుతుందని పేర్కొన్నారు. బిజెపి చాలా పెద్ద పార్టీ అయినందున ఈ ఫిరాయింపులు దానికి పెద్దగా ప్రభావం చూపుతాయని భావించడం లేదని స్పష్టం చేశారు.
ఈ నేతల స్థానంలో వేరొకరిని తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలు వున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బిజెపి స్తంభించిపోదని, తనను తాను సంబాళించుకుని కార్యరంగంలోకి దూకగలదని అంచనా వేశారు.
ఇలా ఉండగా, నాయకుల పనితీరును అంచనా వేస్తూ బిజెపి అధిష్ఠానం తయారు చేసిన ప్రోగ్రెస్ కార్డులే ఆయా నేతల రాజీనామాలకు కారణమనే వాదన వినిపిస్తోంది. సీట్లు, టికెట్ల కేటాయింపులను నిర్ణయించేంది ఈ కార్డులేనని తెల్వడంతో పార్టీని వీడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి రెండేండ్ల ముందు నుంచే యోగి సర్కార్ 2022 ఎన్నికలకు సిద్ధమైంది.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ముఖ్యంగా కులాల సమతూకాలు, వివిధ వర్గాలకు ప్రాధాన్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గతేడాది సెప్టెంబర్లో మంత్రివర్గంను యోగి ఆదిత్యనాథ్ విస్తరించారు. ఇదే సందర్భంలో అందరి ప్రోగ్రెస్ రికార్డులను తయారు చేశారు. ఈ జాబితాలో ప్రస్తుతం రిజైన్ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి.
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, ప్రజల్లో ఆదరణ కోల్పోవడం వంటి అంశాలను పార్టీ పరిగణనలోకి తీసుకుందని కొంతమంది కీలక నేతలు చెప్పారు. దీని ఆధారంగా 2022 సీట్ల కేటాయింపులో వారికి చెక్ పెట్టాలని పార్టీ యోచిస్తున్నదని, దీన్ని పసిగట్టిన నేతలు బీజేపీపై రాష్ట్రంలో ప్రతికూలత సృష్టించే వ్యూహంతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.