దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్ హర్షవర్ధన్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తొలి విడత జాబితాలో పేరు లేకపోవడంతో మరుసటి రోజే ఆయన ఈ ప్రకటన చేశారు. ఆయన స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్కు టికెట్ ఇచ్చారు.
దీంతో నిరాశకు గురైన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎంపీ గౌతమ్ గంభీర్, హజారీభాగ్ ఎంపీ జయంత్ సిన్హా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించాలని కోరారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి హర్షవర్ధన్ సైతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. డాక్టర్ హర్షవర్ధన్ దాదాపు 35 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో కొనసాగారు. మొత్తం ఐదుసార్లు అసెంబ్లీ, రెండుసార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చోటీ గెలుపొందారు. దాంతో పాటు పార్టీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లోనూ కీలక పదవులను చేపట్టారు.
ఆయన మళ్లీ తిరిగి డాక్టర్ వృత్తిని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానగర్‌లోని ఈఎన్టీ క్లినిక్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 50 సంవత్సరాల కిందట పేదలకు సహాయం అందించాలనే కోరికతో కాన్పూర్‌లోని ఎస్‌ఎస్‌వీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్నానని, ఆ సమయంలో మానవాళికి సేవ చేయడమే నినాదమని పేర్కొన్నారు.
అయితే, అప్పటి ఆర్ఎస్ఎస్ నాయకత్వం అభ్యర్థన మేరకు ఎన్నికల రంగంలోకి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానాలు, మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడు దశాబ్దాలకుపైగా సాగిన ప్రయాణానికి ఎంతో దోహదపడ్డారని పేర్కొన్నారు.
మరోవంక, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్ పోటీకి వెనకడుగు వేశారు. తాను పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేనని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి అసన్సోల్ అభ్యర్థిగా నా పేరును ప్రకటించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే.. కొన్ని కారణాల వల్ల నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయలేను’’ అని ఆయన ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ఢిల్లీలోని ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో చాందినీ చౌక్, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ స్థానాలున్నాయి. ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ మినహా సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరించింది.
సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించగా, అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే మొదటి జాబితాలో 33 మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు. వారిలో మాజీ మంత్రి హర్షవర్ధన్‌తోపాటు ఎప్పుడూ వివాదాల్లో ఉండే సాధ్వి ప్రగ్యా ఠాకూర్, ప్రస్తుత మంత్రులు మీనాక్షి లేఖి, జాన్ బర్లా కూడా ఉన్నారు.