బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్న నిందితుడి ఆచూకీ తెలియచేసిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) బుధవారం ప్రకటించింది. తలపై క్యాప్, ముఖానికి మాస్కు, కూలింగ్ గ్లాసెస్ ధరించి కేఫ్‌లోకి ప్రవేశిస్తున్న అనుమానితుడి ఫోటోను తన అధికారిక ఎక్స్(ఇదివరకటి ట్విట్టర్) హ్యాండిల్లో ఎన్ఐఎ పోస్టు చేసింద
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అందచేయడానికి ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ అడ్రస్‌లను ఎన్ఐఎ షేర్ చేసింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఎ హామీ ఇచ్చింది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును ఈ వారం మొదట్లో ఎన్ఐఎకు అప్పగించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు.
రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోని బాంబుకు టైమర్ సెట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ పేలుడు కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు(నిరోధక) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తునకు సంబంధించి ఎన్ఐఎకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. 26/11 ముంబై ఉగ్ర దాడులను పురస్కరించుకుని 2008లో ఎన్ఐఎ ఏర్పాటు జరిగింది.