లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో పొత్తులు కొలిక్కి వచ్చాయి. చిన్న చిన్న భాగస్వామ్య పార్టీలకు సీట్లను డీఎంకే ఇప్పటికే ఖరారు చేయగా, కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల ఒప్పందం శనివారం ఖరారయింది. కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు జరిగితే 9+1 సీట్లు ఆ పార్టీకి వదిలేందుకు డీఎంకే అంగీకరించింది. తమిళనాడులో 9 సీట్లలో, పుదుచ్చేరిలో 1 సీటులో కాంగ్రెస్ పోటీ చేస్తుంది.
పొత్తుల్లో భాగంగా ఎండీఎంకే, ఐయూఎంఎల్, కేఎండీకేలకు ఇప్పటికే ఒక్కో లోక్సభ స్థానాన్ని డీఎంకే కేటాయించింది. ఎండీఎంకే, ఐయూఎంఎల్ తమ తమ గుర్తులతో పోటీ చేయనుండగా, కేఎండీఎంకే మాత్రం డీఎంకే గుర్తుపై పోటీకి దిగనుంది. చర్చల్లో కుదరినట్టు చెబుతున్న ఏకాభిప్రాయం ప్రకారం, సీపీఐ, సీపీఎం, విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే)లు తలో రెండు సీట్లలో తమ పార్టీ గుర్తులతో పోటీచేయనున్నారు.
ఇలా ఉండగా, నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ సారథ్యంలోని మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) శనివారం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరింది. రానున్న లోక్సభ ఎన్నికలలో డిఎంకె కూటమి తరఫున ప్రచారం చేయనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటించింది. 2025లో జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమకు ఒక సీటును కేటాయించినట్లు ఆ పార్టీ ప్రకటించింది.
కమల్ హాసన్ పార్టీకి లోక్సభ ఎన్నికలలో సీట్లను కేటాయిస్తారని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. చెన్నైలోని డిఎంకె ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కమల్ హాసన్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తమ పార్టీ డిఎంకె సారథ్యంలోని కూటమిలో చేరినట్లు చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ కమల్ హాసన్ తెలిపారు. తాము ఎటువంటి పదవులను ఆశించడం లేదని ఆయన చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని, డిఎంకె సారథ్యంలోని కూటమికి సంపూర్ణ మద్దతును అందచేస్తామని ఆయన తెలిపారు.
ఇది పదవుల కోసం కాదని, దేశం కోమని ఆయన అన్నారు. ఇద్దరు నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఏకైక లోక్సభ స్థానంలో ఎంఎన్ఎం కూటమి తరఫున ప్రచారం చేస్తుంది. కాగా, డీఎంకే కూటమిలో రెండు సీట్ల కోసం పట్టుబట్టిన ఎండీఎంకే చివరకు ఒక స్థానానికే సరిపెట్టుకుంది.
ఈ మేరకు శుక్రవారం ఉదయం డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. సీట్ల సర్దుబాట్లపై డీఎంకే కమిటీ, ఎండీఎంకే కమిటీ సభ్యుల నడుమ మూడు విడతలుగా చర్చలు జరిగినా సీట్ల కేటాయింపు ఖరారు కాలేదు. చివరకు స్టాలిన్ సమక్షంలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది.