రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ‘మిషన్ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్ వి) సాంకేతికతతో అభివృద్ధి చేశారు.
దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఆసియా యావత్తూ దీని పరిధిలోకి వస్తుంది. అగ్ని-5 విజయవంతంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలకు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.
మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం.. దేశ రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ కొనియాడారు.
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని ఇవి చేరుకోగలవు. అవన్నీ మన రక్షణ బలగాలకు అందుబాటులోకి వచ్చాయి.
మిషన్ దివ్యాస్త్ర అనేది అతిపెద్ద అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్ అని తెలుస్తోంది. ఈ దివ్యాస్త్రకు దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒక మిసైల్‌ని ఉపయోగించి.. బహుళ వార్ హెడ్స్‌ను వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్‌ను ఛేదించవచ్చని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మిషన్ దివ్యాస్త్ర విజయవంతం కావడంతో.. భారత రక్షణ విభాగంలో మరో అస్త్రం చేరినట్లు అయ్యింది.