గ్లోబల్ సప్లయ్ చైన్‌లో నమ్మకమైన భాగస్వామిగా మారడానికి భారతదేశం ఇప్పుడు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ భారతదేశం కూడా ప్రస్తుతం అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొంటున్నదని గుర్తు చేశారు.
భారతీయ యువతలో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌పై అత్యుత్సాహం కనబడుతుంది కాబట్టి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనువైన సమయం అని చెప్పారు. 2014లో, భారతదేశంలో కేవలం 100 స్టార్టప్‌లు మాత్రమే ఉన్నాయి, కానీ నేడు వాటి సంఖ్య 60,000 పైగా ఉంది. భారతదేశంలోని యువత పెట్టుబడులను సులభతరం చేయడానికి, ప్రపంచ వ్యాపారాలను దేశంలో కొత్త స్థాయిలకు చేరుకునేలా చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ప్రధాన మంత్రి తెలిపారు.
భారతదేశంలో చాలా వ్యాపారాలలో ప్రభుత్వ జోక్యం ఉండే కాలం ఒకప్పుడు ఉండేదని పేర్కొంటూ, ఆ సమయంలో భారతదేశం లైసెన్స్ రాజ్‌కు అపఖ్యాతి పాలైందని ప్రధాని చెప్పారు. అయితే ఇప్పుడు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, భారతదేశం వాటిలో తన జోక్యాన్ని తగ్గించి, వ్యాపారాన్ని సులభతరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశంలో కార్పొరేట్ పన్ను రేట్లు సరళీకృతం చేశామని అంటూ ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వం కలిగిన వాటిలో ఒకటిగా మార్చామని తెలిపారు.
.గత సంవత్సరంలో, వ్యాపారాలు సులభతరం చేయడానికి భారతదేశం 25,000 అనుమతుల అవసరాలని తగ్గించిందని, రెట్రోస్పెక్టివ్ పన్నును సరిదిద్దిందని, డ్రోన్లు, అంతరిక్షం, జియోస్పేషియల్ మ్యాపింగ్ వంటి రంగాలను భారత ప్రభుత్వం నియంత్రించడం లేదని ప్రధాని వెల్లడించారు.
మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అనే నినాదంతో, గ్లోబల్ సప్లై చైన్‌ను సులభతరం చేయడానికి భారతదేశం అనుకూలంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. టెలికాం, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకే కాకుండా సెమీకండక్టర్ రంగానికి కూడా భారతదేశంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన చెప్పారు.
“ఈ రోజు, మేము వ్యాపారాన్ని సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాము, వ్యాపారాలలో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించాము. తమ ప్రభుత్వం భారతదేశాన్ని స్వావలంబనగా మార్చే మార్గంలో ఉందని, ఇక్కడ ప్రక్రియలను సులభతరం చేయడంపై మాత్రమే కాకుండా, పెట్టుబడి, ఉత్పత్తిని ప్రోత్సహించడంపై కూడా దృష్టి సారిస్తుందని చెప్పగలను” అంటూ ప్రధాని భరోసా ఇచ్చారు.
ప్రపంచ నిపుణులు భారతదేశ సంస్కరణలను ప్రశంసిస్తున్నారు మేము మా వంతుగా ప్రపంచ అంచనాలను నెరవేరుస్తాము,” అని హామీ ఇచ్చారు. “వచ్చే 25 సంవత్సరాలలో భారతదేశ వృద్ధి కాలం పచ్చగా, పరిశుభ్రంగా ఉంటుంది. స్థిరంగా, నమ్మదగినదిగా ఉంటుంది. భారతదేశ విధానాలు, నిర్ణయాలు కేవలం ప్రస్తుత అవసరాలపై మాత్రమే కాకుండా, రాబోయే 25 సంవత్సరాల లక్ష్యాలపై కూడా ఆధారపడి ఉంటాయి, ”అని ప్రధాని మోదీ తెలిపారు.
పూర్తి అప్రమత్తతో మూడో వేవ్ పై పోరాటం
కరోనా మూడవ వేవ్‌తో భారతదేశం పూర్తి అప్రమత్తతతో పోరాడుతోందని, అదే సమయంలో తన ఆర్థిక వృద్ధిని కూడా కొనసాగిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ అనే విజన్‌ను అనుసరించి మహమ్మారి సమయంలో భారతదేశం అనేక దేశాలకు అవసరమైన మందులు, టీకాలను సరఫరా చేయడం ద్వారా కోట్లాది మంది ప్రాణాలను ఎలా కాపాడుతోందో ప్రపంచం చూసిందని ఆయన గుర్తు చేశారు.
భారతదేశం వంటి బలమైన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఒక అందమైన బహుమతిని – ఆశల పుష్పగుచ్ఛాన్ని అందించిందని ఆయన చెప్పారు. “ఈ పుష్పగుచ్ఛంలో, భారతీయులమైన మనకు ప్రజాస్వామ్యంపై అచంచలమైన నమ్మకం ఉంది.” భారతదేశం సరైన మార్గంలో సంస్కరణలపై దృష్టి సారించిందని పేర్కొన్న మోదీ, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమ సమయమని తెలిపారు. .
మోదీతో పాటు, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సువా వాన్ డెర్ లేయన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు సహా పలువురు దేశాధినేతలు కూడా వర్చువల్ ఈవెంట్లో ప్రసంగించారు.
కాగా, ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కొనాలి, కరోనా అనంతర ప్రపంచాన్ని ఎలా నిర్మించాలనే ప్రధాన, అత్యవసర ప్రశ్నలకు ఈ సమావేశాల్లో సమాధానాలు దొరకాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలివేనని ఆయన పేర్కొన్నారు.
గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనిరీతిలో ఈనాడు ప్రపంచం ప్రధాన మార్పులకు లోనవుతోందని చెబుతూ ఈ మార్పులనేవి కేవలం ఒక దేశానికి, లేదా ప్రాంతానికి, నిర్దిష్ట కాలానికి పరిమితం కాలేదని, అంతర్జాతీయంగా పెనుమార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. శతాబ్ద కాలంలో ఒకసారి ఇటువంటి పెనుమార్పులు సంభవించినపుడు ఈ కల్లోలిత, పరివర్తనా కాలంలో ప్రపంచం తనను తాను కనుగొంటుందని చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు, కీలకమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రపంచ నేతలకు దావోస్ సమావేశం ఒక అవకాశానిు కల్పిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎప్) తెలిపింది.