లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. ఆమె సోదరుడు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన కుటుంబంతో బాబున్ బెనర్జీకి ఎలాంటి సంబంధాలు లేవని, ఆయనతో బంధం తెంచుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగానే కుటుంబ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని దీదీ తేల్చి చెప్పారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తృణముల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే 42 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌ను మమతా బెనర్జీ విడుదల చేశారు. అయితే టీఎంసీ విడుదల చేసిన జాబితాపై బాబున్ బెనర్జీ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే దీదీ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై బాబున్ బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బాబున్ బెనర్జీపై దీదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే బాబున్ బెనర్జీతో అన్ని బంధాలను తెంచుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. దీదీ తమ్ముడు బాబున్ బెనర్ ఇటీవల బీజేపీ వర్గాలతో సన్నిహితంగా ఉన్నట్లు టీఎంసీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
తాను, తన కుటుంబం బాబున్ బెనర్జీతో ఉన్న అన్ని సంబంధాలను కట్ చేసినట్లు దీదీ స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రతీ సారి ఏదో ఒక సమస్య సృష్టిస్తారని, అత్యాశపరులు అంటే తనకు ఇష్టం ఉండదని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ సందర్భంగానే కుటుంబ రాజకీయాలను తాను నమ్మను అని తెలిపారు.
ఇక టీఎంసీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌పై బాబున్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తాను విన్నట్లు చెప్పిన దీదీ ఆయన బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మమత బాబున్ బెనర్జీకి నచ్చింది చేసుకోనివ్వండని, అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇటీవల విడుదల చేసిన టీఎంసీ జాబితాలో హౌరా లోక్‌సభ స్థానాన్ని మళ్లీ ప్రసూన్ బెనర్జీకి ఇవ్వడంపై బాబున్ బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ప్రస్తుతానికి బాబున్ బెనర్జీ టీఎంసీలోనే కొనసాగుతుండటం గమనార్హం.