కేంద్రంలో బిజెపినే మరలా అధికారంలోకి వస్తుందనే అంచనాతో తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం సీట్ల కేటాయింపులో తాము రాజీపడ్డామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యమని, వైసిపి విముక్త రాష్ట్రం కోసం జనసేన, బిజెపితో కలిశామని తెలిపారు.
‘కలలకు రెక్కలు’ కార్యక్రమం రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన వెబ్సైట్ను బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ప్రారంభించిన సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం 2018లో ఎన్డిఎ నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా హోదా కావాలని, విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించొద్దని అడుగుతున్నామని వెల్లడించారు.
తాను ఎన్డిఎలో కొనసాగి ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన హయాంలో పోలవరం నిర్మాణం 72 శాతం పూర్తయిందని గుర్తు చేశారు. విభజన చట్టంలో ఉన్న విద్యాసంస్థలతో పాటు వెనకబడ్డ జిల్లాలకు రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు సాధించామని చెప్పారు. కానీ వైసిపి ప్రభుత్వం ఈ నిధులను కూడా తీసుకురాలేదని విమర్శించారు.
విశాఖ రైల్వే జోన్కు ప్రభుత్వం భూములు ఇవ్వలేదని, కేసుల కోసం తిరిగి వాళ్లు లాభపడ్డారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన విధ్వంసంతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పారు.
కేంద్ర సహకారంతోపాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అవసరమని, లేదంటే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మంత్రి విడదల రజిని టికెట్ ఇప్పిస్తానని మల్లెల రాజేష్ అనే వ్యక్తి వద్ద రూ.6.5 కోట్లు తీసుకున్నారని, దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి బ్రోకరిజం చేశారని విమర్శించారు.