యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం వెలువడనుంది. సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద ఈ ప్రెస్‌మీట్ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు.
ఈ మేరకు ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి రానుంది. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు.
కాగా ప్రస్తుత ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. ఆ గడువుకు ముందే కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా 2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న వెలువడింది. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల తేదీలపై ప్రకటన చేస్తారు. ఆ ప్రెస్మీట్లో కొత్త కమీషనర్లు జ్ఞానేంద్ర కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ కూడా పాల్గొంటారు. విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్ జరగనున్నది. అయితే జమ్మూకశ్మీర్‌కు జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ప్రకటన చేస్తుందా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఈసారి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో ఓటింగ్ జరిగే రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాముల్లో ఈసీ ప్రెస్‌మీట్ లైవ్ కానున్నది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు మాత్రం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.
మరోవంక, ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ప్రతి అంశానికి ప్లస్, మైనస్ ఉంటుందని సుప్రీం ఈ కేసులో అభిప్రాయపడింది. ఈవీఎంలతో అక్రమాలు జరుగుతున్నట్లు పిటీషన్లో ఆరోపించారు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్త, ఆగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇప్పటికే అనేకమార్లు ఈ అంశానికి చెందిన పిటీషన్లను పరిశీలించామని, ఈవీఎంల పనితీరుకు చెందిన సమస్యల గురించి కూడా కోర్టు ప్రస్తావించినట్లు బెంచ్ తెలిపింది.