బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ అధికారికంగా ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
తాను ఈ సందేశాన్ని టైప్ చేయలేకపోతున్నాను. కానీ కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున తాను తప్పక టైప్ చేయాల్సి వచ్చింది. దయచేసి క్షమించండి.. తనకు మరో మార్గం లేదు. కొత్త దారి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తాను అని తెలిపారు.
ఇటీవల తెలంగాణలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వేరోగా తాను ఎవరినీ నిందించను. తనను నమ్మిన వారిని మోసం చేయను. మళ్లీ చెబుతున్నా.. చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెలో పదిలంగా దాచుకుంటాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని, తాము రెండు సీట్లలో పోటీ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ఆయన శనివారమే రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఈ పొత్తుకు బీఎస్పీ అధిష్టానం ఒప్పుకొనక పోవడంతో రాజీనామా చేశారని, బిఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుండి లోక్ సభకు పోటీచేయబోతున్నారని చెబుతున్నారు.
అయితే బీజేపీ జోక్యం చేసుకొని, తమ పార్టీ నాయకత్వంపై వత్తిడి తేవడంతో పొత్తుకు విముఖత ఎదురైందని ఆరోపించారు. “పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం” అని చెప్పారు.
“నిన్న బీఎస్పీ – బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. త ఈ ప్రస్థానాన్ని ఆపలేను” అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.