గవర్నర్ పదవికి డా. తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది.
చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019, సెప్టెంబర్ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
2019 సెప్టెంబర్ 8న తెలంగాణకు గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు.
కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన తమిళిసై బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కావటంలో ఆమె పాత్ర కీలకమైంది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీకి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్సభ ఎన్నికల్లో నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి మరోసారి ఓడిపోయారు.
2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వేళచ్చేరి నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేయగా.. మరోసారి కూడా ఓటమి ఎదురయ్యింది.