ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన జర్మనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఇదే విషయంపై అమెరికా కూడా స్పందించింది.
తాజాగా, ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, దేశంలో ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అగ్రరాజ్యం పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టుపై ఈ-మెయిల్ ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సమాధానం ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో సమయానికి అనుగుణంగా, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా అధికార ప్రతినిధి తెలిపారు.
కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారాన్ని తాము గమనిస్తున్నామని, పారదర్శక, న్యాయబద్ధ, వేగవంతమైన విచారణ జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖకు సూచించినట్లు ఒక ప్రకటన వెలువరించారు. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పందన విడుదల చేయలేదు.
ఇటీవలె కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఇదే అంశంపై జర్మనీ కూడా స్పందించింది. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు అని జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేయడం పెను దుమారం రేపింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర భారత పౌరుల లాగానే అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా కేజ్రీవాల్ వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో జర్మనీ పేర్కొంది. న్యాయవ్యవస్థకు ఉన్న స్వాతంత్ర్యం, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని తాము భావిస్తున్నామని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి శుక్రవారం చెప్పారు
అయితే భారత అంతర్గత విషయం అయిన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి జర్మనీ స్పందించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లు జారీ చేసింది. దీంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్వీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి రాగా.. భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని.. అందులో జోక్యం చేసుకోవడం ఏంటని మండిపడింది. ఇక ఇప్పుడు ఏకంగా అమెరికానే రంగంలోకి దిగడంతో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందోననే వాదనలు వినిపిస్తున్నాయి.