తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల కాలం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా మంది నేతలు తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీలో ఇప్పటికే చేరారు. మరికొందరు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో నేతల జంపింగ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం కీలక వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఖాళీ అవుతాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఆరోపించారు. వారు కూడా పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు.
ఇలాంటి పరిస్థితిలో కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డికి టచ్లో ఉండటం కాదని.. ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డే ఆయనతో టచ్లో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపీ టికెట్ రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇస్తామని అధిష్ఠానం చెబితే.. వెంకట్ రెడ్డి అడ్డుపడ్డారని వెల్లడించారు.
‘నీ తమ్ముడికి నీకే లొల్లైతుంది. అలాంటి వేరే పార్టీ నేతలు నీతోటి టచ్లోకి ఎందుకు వస్తరు. బీజేపీకి చెందిన ఓ ఒక్క ఎమ్మెల్యేకు ఇప్పటి వరకు అలాంటి చరిత్ర లేదు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేయవద్దని హెచ్చరిస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను నువ్వు ముట్టుకుంటే బిడ్డా.. 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుంది. మేం హూందాగా ఉన్నాం. ప్రజల తీర్పును గౌరవించి గమ్మున ఉన్నాం.’ అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.