ఉత్తర ప్రదేశ్ లో ఒక సీట్ విషయంలో బిజెపి ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నది. అక్కడి నుండి తామే పోటీ చేస్తాం అంటూ భార్య, భర్తలు ఇద్దరు ఎవ్వరికీ వారుగా చెప్పుకొంటున్నారు. భార్య ప్రస్తుతం అక్కడ శాసనసభ్యురాలు. పైగా మంత్రి కూడా. ఆమె అప్పుడే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూకొంటున్నారు. భర్త కూడా తానే అభ్యర్థిని అని చెప్పుకొంటున్నారు. ఒకరి ప్రచారంలో మరొకరి పేరు, ఫోటో లను ప్రస్తావించడం లేదు.
ఆమె యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళా సంక్షేమ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) స్వాతి సింగ్, ఆమె భర్త, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్. ఇద్దరు ఎవ్వరికీ వారుగా లక్నో జిల్లాలోని సరోజినీ నగర్ నుండి పోటీ చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. యూపీలో నాలుగో దశ ఎన్నికల్లో ఫిబ్రవరి 23న ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది.
దయాశంకర్ 2016లో మాయావతిపై కించపరిచే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. బీఎస్పీ నేతలు నిరసన వ్యక్తం చేయడం, మాయావతి రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో, బిజెపి దయాశంకర్ను సస్పెండ్ చేసింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అతనిని అరెస్ట్ చేసింది.
అయితే, దయాశంకర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా లక్నోలో జరిగిన నిరసనపై స్వాతి సింగ్ హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో బిఎస్పి అధినేత్రి మాయావతి, ఆమె అప్పటి పార్టీ సహచరులు నసీముద్దీన్ సిద్ధిఖీ మరియు రామ్ అచల్ రాజ్భర్ (ఇద్దరూ బిఎస్పి నుండి బహిష్కరించబడ్డారు)పై కౌంటర్ ఫిర్యాదు చేశారు. తనపై, దంపతుల కూతురు, దయాశంకర్ సోదరిపై బీఎస్పీ నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
దయాశంకర్ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత, మాయావతికి ధైర్యం చేసి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య స్వాతిపై పోటీ చేయమని సవాల్ చేశారు. ఆ సంవత్సరం ఎన్నికలకు స్వాతి సరోజినీ నగర్ నుండి బిజెపి అభ్యర్థిగా ప్రకటించబడటంతో, ఈ జంట కలిసి అనేక జిల్లాల్లో పర్యటించారు.
అక్కడ వారు తమ కుటుంబ మహిళలపై “అసభ్యకరమైన” నినాదాలు, వాఖ్యలు చేస్తూ క్షత్రియులకు అగౌరవం కలిగించారణై అంటూ బీఎస్పీ నాయకులపై ప్రచారం చేశారు. 2017 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత, బిజెపి దయాశంకర్ సస్పెన్షన్ను ఉపసంహరించుకుంది. స్వాతిని యోగి క్యాబినెట్లోకి చేర్చుకుంది.
ఈ సారి పోటీ చేయాలనుకొంటున్నట్లు దయాశంకర్ మొదటి సంకేతం ఈ నెల ప్రారంభంలో, తన పేరు, హోదాతో పాటు నియోజకవర్గం పేరు – “విధానసభ-170 సరోజినీ నగర్”తో పాటు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపాడు. “పార్టీ నాకు టిక్కెట్ ఇస్తే నేను పోటీ చేస్తాను… నేను పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తను” అని చెబుతున్నారు.
అదే సీటు నుంచి ఆయన భార్య, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పోటీలో ఉన్నారా అని అడిగినప్పుడు, “పార్టీ మా పనిని చూసింది. వారిని నిర్ణయించుకోనివ్వండి” అంటున్నారు.
స్వాతి సింగ్ “అక్కడి నుండి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నందున” మంత్రి ఇంటింటికీ ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మంత్రి ఫోటోతో పాటు నియోజకవర్గం పేరు ఉన్న ఫ్లెక్స్ బోర్డు ఫోటోను కూడా ఆమెకు సన్నిహితులు పంచుకున్నారు.
అయితే, స్వాతి సింగ్ పోస్టర్లలో దయాశకర్ ఫోటో లేదు. అదే విధంగా దయాశంకర్ పోస్టర్లలో ఆమె ఫోటోలు లేవు. దానితో ఎవ్వరికీ సీట్ ఇవ్వాలన్నది బిజెపి నాయకత్వానికి ప్రశ్నార్ధకరంగా మారింది. స్వాతి సింగ్కు టికెట్ నిరాకరించినట్లయితే, అది మహిళా ఓటర్లలో తప్పుడు సందేశాన్ని పంపుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఇటీవల, ఇతర పార్టీల నుండి బిజెపిలోకి చేరాలనుకునే నాయకులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ‘రాష్ట్ర జాయినింగ్ కమిటీ’లో సభ్యుడిగా దయాశంకర్ను బిజెపి నియమించింది. 2007లో దయాశంకర్ బల్లియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఐదో స్థానంలో నిలిచారు. 1999లో ఎబివిపి అభ్యర్థిగా లక్నో యూనివర్శిటీకి విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఉన్నారు. అంతకు ముందు సంవత్సరం దాని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.