శ్రీరాముడిని కొలిచేవారిని కాంగ్రెస్ బహిష్కరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. ప్రజలంతా ఆరాధించే ‘శక్తి’ని కూకటివేళ్లతో పెకలిస్తానంటోందని విమర్శించారు. మనసులో ఇంత విషం ఎందుకు పెట్టుకుందో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, యూపీలోని ఫిలిబిత్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ అనేక అడ్డంకులు సృష్టించిందని.. తీరా ప్రజలు సొంత సొమ్ముతో దానిని నిర్మించాక ఆలయ ప్రతిష్ఠకు ఆహ్వానిస్తే తిరస్కరించి శ్రీరాముడిని అవమానించిందని మండిపడ్డారు.
పైగా రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు హాజరైన వారిని ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరించిందని పేర్కొంటూ ఇదేం పార్టీ అని ప్రశ్నించారు. బుజ్జగింపు రాజకీయాల బురదలో కాంగ్రెస్ కూరుకుపోయిందని మండిపడ్డారు. ‘యావద్దేశం శక్తిని ఆరాధిస్తోంది. దాని ముందు అందరూ తలొంచుతారు. అలాంటి శక్తిని కూడా కాంగ్రెస్ అవమానించింది. దానిని కూకటివేళ్లతో పెకిలిస్తామని అంటున్నారు. శక్తి ఉపాసకులెవరూ ఈ అవమానానికి ఇండీ కూటమిని క్షమించరు’ అని స్పష్టం చేశారు.
ఇండీ కూటమిలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) కూడా వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని విమర్శించారు. విదేశాల్లో తమపై జరుగుతున్న అత్యాచారాలను భరించలేక హిందువులు, సిక్కులు అక్కడి నుంచి పారిపోయి వచ్చారని.. వారికి పౌరసత్వాన్ని భారత్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారని ప్రధాని నిలదీశారు.
ఈ పార్టీలు అవినీతిపరులను రక్షించాలని చూస్తున్నాయని.. దేశాభివృద్ధికి కృషిచేస్తున్న తనను దూషిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని ఆపాలని తనను బెదిరిస్తున్నాయని చెప్పారు. ‘దేశ భద్రతకు మోదీ గ్యారెంటీ ఇస్తే నన్ను తిడుతున్నారు. 370 అధికరణను రద్దు చేస్తే పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నారు. నేను మహాకాళుడి భక్తుడిని. ఎవరికీ భయపడను. మహాకాళుడికి, ప్రజలకు మాత్రమే శిరసు వంచుతాను. దేశాభివృద్ధి కోసం, దానికి సేవ చేయడం కోసం తిట్లు కూడా భరించడం నేర్చుకున్నాను’ అని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
చెన్నైలో మోదీ రోడ్‌షో
‘మోదీ.. మోదీ’ నినాదాలతో మంగళవారం చెన్నై నగరం మార్మోగింది. బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు తమిళిసై(దక్షిణ చెన్నై), వినోజ్ పి.సెల్వం(సెంట్రల్ చెన్నై), పాల్ కనకరాజ్(ఉత్తర చెన్నై)లకు మద్దతుగా మోదీ మంగళవారం సాయంత్రం చెన్నైలో రోడ్ షో నిర్వహించారు.
కాషాయరంగు ఓపెన్‌టా్‌ప వాహనంపై మోదీతోపాటు తమిళిసై, వినోజ్ పి.సెల్వం, పాల్ కనకరాజ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రదర్శనగా వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్పాలతో అలంకరించిన కారులో బీజేపీ గుర్తు ‘కమలం’ పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రోడ్డుకు ఇరువైపులా పార్టీ జెండాలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయగా, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు.